Friday, November 22, 2024

కదలరు, వదలరు.. వైద్యశాఖలో కొనసాగుతున్న డిప్యుటేషన్లు

అమరావతి, ఆంధ్రప్రభ: వైద్యశాఖలో అడ్డగోలు డిప్యూటేషన్లు కొనసా..గుతున్నాయి. క్యాష్‌ కొట్టు.. డిప్యూటేషన్‌ పట్టు అన్న‌ చందంగా పరిస్థితి తయారైంది. అన్ని విధాలా తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ఏళ్ళ తరబడి కొందరు ఉద్యోగులు తిష్టవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ల ముసుగులో పైరవీలు రాజ్యమేలుతున్నాయి. వెరసి పీహెచ్‌సీలో మెరుగైన వైద్యసేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల్ని సైతం కొందరు అవినీతి అధికారులు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులను డెకరేషన్‌ వర్క్‌ ఆర్డర్‌ ల పేరుతో ఎక్కడికి పంపవద్దని ఎక్కడి వైద్యులు అక్కడే పని చేయాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వైద్య శాఖలో ఉన్న ఖాళీలను గుర్తించి ఆస్థానాలలో శాశ్వత లేదా కాంట్రాక్ట్‌ పద్ధతిపై నియమించాలని వైద్యసేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని చీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మ కూడా డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ జిల్లా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు..

అయినా ఫలితం శూన్యం. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ 30.4.2022 ద్వారా జిల్లా వైద్య శాఖ అధికారులకు రాష్ట్ర స్థాయిలో ఆదేశాలిచ్చింది. ఎట్టి పరిస్థితులలోను డిక్టేషన్‌ మరియు వర్క్‌ ఆర్డర్‌ లు ఇవ్వవద్దని వాటిని రద్దు చేయమని పేర్కొంది. రాష్ట్ర స్థాయిలోని డిప్యూటేషన్‌ లు మరియు వర్క్‌ ఆర్డర్‌ ను రద్దు చేసి 4.5.2022 లోపు తనకు రిపోర్టు పంపించవలసిన ఆదేశిస్తూ డిప్యుటేషన్పై రాష్ట్రస్థాయిలో ఉన్న 78 మంది వైద్యుల లిస్టును జిల్లా అధికారులకు పంపారు. ఇది జరిగి పదకొండు రోజులు గడిచినా పూర్తి స్థాయిలో వారి వారి స్థానాలకు పంపకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement