Friday, November 22, 2024

Big Story: న‌ర్సాపురం మ‌రో హుజురాబాద్ కానుందా? వ్యూహం ర‌చిస్తున్న క‌మ‌ల‌నాథులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత కనుమూరు రఘురామకృష్ణ రాజు రాజీనామా ప్రకటన రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయండి.. లేదంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానంటూ ఆయన చేసిన ప్రకటన అనంతరం భారతీయ జనతా పార్టీ చకచకా పావులు కదుపుతోంది. రఘురామకృష్ణ రాజు రాజీనామా చేసిన మరుక్షణమే పార్టీ కండువా కప్పి ఆహ్వానించాలన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీకి ఎదురుగా బలమైన అభ్యర్థిని నిలబెట్టినట్టవుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోగుచేస్తే గెలిచి సంచలనం కూడా సృష్టించవచ్చని ప్రణాళికలు రచిస్తోంది. ఒక్క గెలుపు అందుకున్నా, రాష్ట్రంలో బీజేపీకి ఊహించనంత ఊపొస్తుందని నాయకత్వం భావిస్తోంది.

హుజారాబాద్‌ను తలపించేలా.. !
నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఉపఎన్నికలు మరో హుజారాబాద్‌ను తలపించనున్నాయి. తమ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను బర్త్‌రఫ్ చేసిన తర్వాత పార్టీని వీడి బీజేపీ టికెట్ మీద పోటీకి నిలవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి హుజూరాబాద్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఈటల రాజేందర్ గెలుపొందడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోయాయి. అప్పటి వరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ను పక్కకు నెడుతూ టీఆర్ఎస్‌కు బీజేపీయే పోటీ అన్న చందంగా రాజకీయం మారిపోయింది. కమలదళానికి అసలేమాత్రం పట్టులేని హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ వ్యక్తిగత బలంతోనే గెలిచినప్పటికీ, పార్టీకి అనూహ్య రాజకీయ లబ్ది చేకూరింది.

ఇదే తరహాలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్సాపురం నియోజకవర్గానికి ఉపఎన్నికలు సంభవిస్తే ఇక్కడ కూడా హుజూరాబాద్ తరహాలో లబ్ది పొందే అవకాశం ఉందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. రఘురామకృష్ణ రాజు తిరుగుబాటు, అనునిత్యం మీడియాలో చేస్తున్న విమర్శలతో వైఎస్సార్సీపీ నాయకత్వం తీవ్ర అసహనంతో ఉంది. రఘురామకృష్ణ రాజు పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. నిజానికి పార్టీ నుంచి డిస్మిస్ చేసే అవకాశం వైఎస్సార్సీపీ దగ్గర ఉన్నప్పటికీ, ఆ చర్యతో రఘురామకృష్ణ రాజు పార్లమెంటరీ సభ్యత్వానికి వచ్చే ప్రమాదమేమీ ఉండదు. స్వతంత్ర సభ్యుడిగా కొనసాగవచ్చు. అందుకే ఎలాగైనా అనర్హత సరే వేటు పడేలా చేయాలని వైఎస్సార్సీపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణ రాజు తానే స్వయంగా రాజీనామా చేస్తే, తద్వారా జరిగే ఉపఎన్నికలను వైఎస్సార్సీపీ నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. వైఎస్సార్సీపీని వ్యతిరేకించే ఓటర్లు రఘురామకృష్ణ రాజుకే ఓటు వేయడానికి మొగ్గుచూపుతారని, అందుకే ఆయనకు టికెట్ ఇచ్చి బరిలో దింపాలని భావిస్తున్నట్టు తెలిసింది. పైగా బీజేపీకి జనసేన బలం తోడవుతుందని, నియోజకవర్గంలోని కాపు ఓటుబ్యాంకు కూడా కలిసొస్తుందని లెక్కలు వేస్తోంది. ఇకపోతే వైఎస్సార్సీపీని ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా చేయగల్గితే, వ్యతిరేక ఓటునంతా ఒకవైపు కూడగట్టి గెలుపొందవచ్చని భావిస్తోంది. బీజేపీతో చెలిమి కోసం ఎదురుచూస్తున్న టీడీపీ, ఈ ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా సహకరించే అవకాశం లేకపోలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement