ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే.. ప్రభుత్వం పరంగా పలు అంశాల్లో వైసీపీ తీరు, ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ పాలన సరిగా లేదని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఈ మధ్య కాలంలో తమ వేగాన్ని పెంచాయి. జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి సభలు నిర్వహిస్తూ జనాలను ఆకట్టుకునేలా బీజేపీ, జనసేన వ్యవహరిస్తున్నాయి. కాగా, చంద్రబాబు సైత ఉత్తరాంధ్ర నుంచి యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
వీటన్నితోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ లీడర్లను, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి జాగ్రత్తగా ఉండాలని, ప్రజల్లోనే ఉంటూ చెడ్డపేరు తెచ్చుకోకుండా చూడాలని సీఎం జగన్ సూచించారు. కొంతమంది ఎమ్మెల్యేలకు అయితే చురకలు వేశారు. మీ తీరు మారకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వబోమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్న చర్చ అంతటా జరుగుతోంది. పార్టీల్లో లీడర్ల నుంచి కేడర్ దాకా ఇదే చర్చించుకుంటున్నారు. మరి సామాన్య ప్రజానీకం ఏమనుకుంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా లేదా? రాజకీయ అవగాహన ఉన్న మేరకు మీ అభిప్రాయాన్ని ఈజీగా షేర్ చేసుకోవచ్చు.