రంపచోడవరం (ఏఎస్ఆర్ జిల్లా), డిసెంబరు 30 (ఆంధ్రప్రభ) : సోమవారం తెల్లవారుజామున రంపచోడవరం మండలం ఆకూరు పంచాయతీ కోయిలగూడెం గ్రామానికి చెందిన తేల్లం వెంకన్న దొర భార్య మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ రామన్నవలసకు చెందిన లక్ష్మి బిడ్డతో సహా ప్రసాదం అవ్వకుండానే మరణించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు భర్త వెంకన్న దొర మాట్లాడుతూ… రంపచోడవరం గవర్నమెంట్ హాస్పిటల్ లో క్షేమంగా నా భార్యను డెలివరీ కోసం జాయిన్ చేయడం జరిగిందని, మొదట 23వ తారీకుని ఆపరేషన్ చేస్తామని, ఆ తర్వాత 26వ తేదీ అని, మరలా 28వ తారీఖున ఆపరేషన్ అని అన్నారన్నారు.
కానీ నిన్నటి రాత్రి ఒంటి గంటకి నొప్పులు వచ్చాయని ఆ తర్వాత మూడు గంటలకి నా భార్య బిడ్డతో సహా ఫిట్స్ వచ్చిచనిపోయిందని స్టాఫ్ నర్స్ చెప్పారని, ఒంటి గంటకి నా భార్యకి నొప్పులు వచ్చినప్పుడు సంబంధిత వైద్యులు ఎవరూ లేరని ఒక స్టాఫ్ నర్స్ వైద్యం చేశారని, కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నొప్పులు వచ్చిన వెంటనే నా భార్య దగ్గర గైనకాలజిస్ట్ ఉంటే నా భార్య బిడ్డతో సహా బ్రతికేదని, కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఈరోజున బిడ్డతో సహా నా భార్యను పోగొట్టుకున్నానని తీవ్ర ఆవేదన చెందారు.
పూర్తి ఆరోగ్యంగా నా భార్యని హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగిందని, ఇన్ని రోజులు హాస్పిటల్లో వైద్యం చేసి ఆఖరికి నా భార్య శవాన్ని నాకు అప్పగించారని కన్నీటి కన్నీటి పర్వమయ్యారు. దీనికి సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాలాగా మరొక తమ సాటి గిరిజనులకు ఎవరికి కూడా ఎటువంటి సంఘటన జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితురాలు, మృతురాలు భర్త, స్నేహితులు, గ్రామ ప్రజలు అధికారులను డిమాండ్ చేశారు. ప్రసవ సమయంలో గైనకాలజిస్ట్ ఉంటే కనీసం తల్లినైనా, బిడ్డనైనా బ్రతికించేవాళ్ళని, కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మీ చనిపోయిందని గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. గవర్నమెంట్ ఆసుపత్రులకు వైద్యం కోసం రావాలంటే భయమేస్తుందన్నారు.
గిరిజనులకు వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు…
పీఓ కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ
విషయం తెలుసుకున్న వెంటనే పీఓ సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకుని, అక్కడ జరిగిన పరిణామాన్ని సూపరింటెండెంట్, బంధువులు, సిబ్బంది ద్వారా విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం ఉందని, గిరిజనులకు వైద్యం చేసే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే, ఎవరి మీద అయినా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గిరిజనులతో మాట్లాడే విధానం కూడా నేర్చుకోవాలని, ప్రతిరోజూ గైనకాలజిస్ట్ తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలన్నారు. రాత్రి సమయంలో కూడా వచ్చి పర్యవేక్షణలో ఉండాలని, దీనిపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. త్వరలోనే విచారణ కమిటీని వేయడం జరుగుతుందని, అక్కడి నుండే సంబంధిత కమిషనర్ తో మాట్లాడి ఏజెన్సీ పట్ల చిన్నచూపు చూడవద్దన్నారు.
అనుకోని సంఘటన విచారకరం : శేషిరెడ్డి, పర్యవేక్షణ అధికారి
ప్రాంతీయ ఆసుపత్రిలో తల్లి, బిడ్డ ప్రసవ సమయంలో చనిపోవడం బాధాకరమని, అయితే ప్రసవ సమయంలో అనుకోని విధంగా కొద్దిగా తల్లికి ఇబ్బంది కలగడం వల్ల మరణం జరిగిందని, అయితే ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందా ? అసలు ఏమి జరిగిందో దీనిపై విచారణ చేస్తున్నామని సూపరింటెండెంట్ తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత నిజంగా వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇకపై ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.