విజయనగరం, ఆగస్టు 18 (ప్రభ న్యూస్): ప్రజావసరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో రోడ్లు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేస్తోందని మహా విశాఖ ప్రాంతీయ నగరాభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల అన్నారు. వి.ఎం.ఆర్.డి.ఏ. నిధులు రూ.3.22 కోట్లతో నగరంలోని రోడ్లు భవనాల కూడలి నుంచి పాల్ నగర్ వరకు చేపట్టనున్న 1.03 కిలోమీటర్ల రోడ్లు విస్తరణ పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలసి శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… విజయనగరం పట్టణంలో డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో వివిధ రకాల గ్రాంట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఐదు మునిసిపల్ వార్డులతో పాటు పరిసర పది గ్రామాల ప్రజలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా వుంటుందన్నారు. ఈ రోడ్డును రెండు లేన్ల బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేస్తామని, రోడ్డుకు ఇరువైపులా కాలువలు కూడా నిర్మించనున్నట్టు వి.ఎం.ఆర్.డి.ఏ. చైర్ పర్సన్ వెల్లడించారు. నగర ప్రముఖులు వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ… డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో గత నాలుగున్నరేళ్ల కాలంలో గతంలో ఎన్నడూలేని రీతిలో నగర రూపురేఖలు మార్చేవిధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వి.విజయలక్ష్మి, కార్పొరేటర్లు పిన్నింటి కళావతి, వి.ప్రభాకరరెడ్డి, తొగరోతు సంధ్యారాణి, దాసరి సత్యవతి, వి.ఎం.ఆర్.డి.ఏ. పర్యవేక్షక ఇంజనీర్ వి.భవానీ శంకర్, ఇ.ఇ.శ్యాంప్రసాద రావు, డి.ఇ.కార్తీక, ఏ.ఇ.ప్రసాద్, మునిసిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.