Saturday, November 23, 2024

AP | ఆరోగ్యశ్రీ సేవలపై విస్తృత ప్రచారం.. ఈనెల 18 నుంచి కొత్త కార్డుల పంపిణీ

అమరావతి, ఆంధ్రప్రభ: వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీతో పేదవాడికి ఆరోగ్య భరోసా లభిస్తోంది. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పాలనలో అత్యంత బలోపేతమైన వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.25లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందుతోంది.

  • క్యాన్సర్‌ లాంటి తీవ్ర వ్యాధలతో బాధపడేవారికి రూ.25 లక్షలు ఖర్చైనా ప్రభుత్వం ఆ చికిత్సల బారాన్ని మొత్తంగా స్వీకరిస్తోంది. గతంలో క్యాన్సర్‌ చికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే డబ్బుపై రూ.5 లక్షల పరిమితి ఉండేది. అయితే ఈ ప్రభుత్వం ఈ పరిమితిని ఎత్తివేస్తూ వారికి పూర్తివైద్యాన్ని అందిస్తోంది. ఇలాంటి ఖరీదైన ప్రొసీజర్ల కోసమే రూ.1,897.86 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది.
  • బైలేటరల్‌ కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ కోసం రూ. 11,97,248 వరకూ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స అందుతోంది. అలాగే స్టెమ్సెల్‌ ట్రాన్సాప్లాంట్లేషన్‌ కోసం రూ.11 లక్షలు, గుండె మార్పిడి కోసం రూ. 10,77,510… ఇలా ఖరీదైన ప్రొసీజర్లకోసం వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద జగనన్న ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించింది. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఇలాంటి వైద్యాన్ని పొందడం ఎలా అన్నదానిపై అవగాహన కల్పించడంపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టిపెట్టింది.

విస్తరించిన సేవలు, గణనీయంగా పెరిగిన ప్రొసీజర్లతో ఆరోగ్య శ్రీ సేవలను అత్యంత సులభంగా అందుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18 నుంచి భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే రోజున కొత్తగా రూపొందించిన ఆరోగ్య శ్రీకార్డులను గడపగడపకూ అందించడంతోపాటు, లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే యాప్‌ను కూడా సెల్‌ఫోన్లలో డౌన్లోడ్‌ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మున్నెన్నడూ లేని విధంగా ఇందులో ఎమ్మెల్యేలు పాల్గోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

- Advertisement -

ఆపదలో అండగా

పేదల రోగులకు చేయూతనిస్తూ ఆరోగ్య ఆసరా పేరిట వైయస్‌.జగన్‌ మరో విప్లవాత్మక పథకాన్ని తీసుకు వచ్చారు. చికిత్స తర్వాత రోగులు తీసుకునే విశ్రాంతి కాలానికి అండగా నిలుస్తూ దేశంలోని ఎక్కడా లేని విధంగా ఆరోగ్య ఆసరా పథకాన్ని తీసుకు వచ్చారు. రోజుకు కనీసంగా రూ.225లు, గరిష్టంగా నెలకు రూ.5వేల వరకూ చెల్లిస్తోంది. దీంతో అనారోగ్యం కారణంగా ఉపాధి పొందలేని పరిస్థితుల్లో వారికి ఈడబ్బు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ ఒక్క ఆసరా కిందే ఇప్పటివరకూ 25,27,870 మంది రూ.1309.9 కోట్ల రూపాయలు అందుకున్నారు.

సరికొత్త ఫీచర్లతో

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 1,42,34,464 ఉందన్నారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ సరికొత్త కార్డులో మంచి ఫీచర్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతికార్డులో కూడా క్యూఆర్‌ కార్డు, లబ్ధిదారుని ఫొటో ఉంటుంది. యూనిక్‌ హెల్త్‌ ఐడెంటిటీ నంబరు కూడా ఉంటుంది. కుటుంబ యజమాని పేరు, జిల్లా, మండలం, సబంధిత సెక్రటేరియట్‌ పేరు కార్డుకు ఒకవైపున రెసిడెంట్‌ ఐడీ, కుటంబ సభ్యుల పేర్లు వెనుకవైపు ఉంటాయి.

కార్డులో ఉండే క్యూ ఆర్‌ కార్డు ద్వారా విశేషమైన ప్రయోజనాలు ఉన్నాయి. రోగి చేయించుకునే వ్యాధినిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టరు సిఫార్సులు ఈ సమాచారం అంతాకూడా ఐఒఉలో నిక్షిప్తమై ఉంటుంది.

దీనివల్ల రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా గతంలో చేసుకున్న పరీక్షలు, తీసుకున్న మందులు, చికిత్సలు, వైద్యుల సిఫార్సులు, సూచనలన్నీ వెంటనే తెలుసుకునే అవకాశం ఉటుంది. దీనివల్ల రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి వెనువెంటనే అవగాహన వస్తుంది. దీనివల్ల వైద్యం అందించడం మరింత సులభతరం అవుతుంది.

ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరింత మంది ప్రయోజనం కల్పించేలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం బీపీఎల్‌ కుటుంబాలకే కాకుండా ఏడాదికి రూ.5 లక్షల ఆలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా పథకాన్ని వర్తింపుచేసింది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న లబ్ధిదారులు దరఖాస్తు చేసి ఆరోగ్య శ్రీకార్డులను పెద్ద మొత్తంలో పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement