కర్నూలు బ్యూరో – ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో నేత దూరమయ్యాడు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు, తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.. తన నిర్ణయాన్ని నేడు జరిగిన మీడియా సమావేశం వెల్లడించారు. తన అనుచరులు, మద్దతుదారులు, బంధువర్గంతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇవాళ ఉదయమే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఇంకా ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తన సన్నిహిత వర్గాలతో చర్చించిన తర్వాత భవిష్యత్ గురించి ఆలోచిస్తానని చెప్పారు.
కర్నూలు పార్లమెంటు పరిధిలో గడిచిన నాలుగునరేళ్లుగా అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. . గత నాలుగేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి కర్నూల్ పార్లమెంటు పరిధిలో సమస్యలు వివరించేందుకు అవకాశం మాత్రం కలిగిందన్నారు. నియోజకవర్గ లో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే ఎమ్మెల్యేలు చూసుకుంటారని ఆయన చెప్పారన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా తన పరిధిలో తాను చేయగలిగిన కార్యక్రమాలు చేశానన్నారు.
కానీ అనుకున్నన్నీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయా నని అన్నారు. . తనకు ఈసారి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయడానికి అవకాశం ఉందో లేదో తెలియదు గాని ఇతరులకు ఇస్తారని మాత్రం తెలిసిందన్నారు. పార్టీ నుంచి తనకు ఎలాంటి నేరుగా సంకేతాలు ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ తన భవిష్యత్ కార్యాచరణను నియోజకవర్గంలో ప్రజలు సహాచర్లు, సన్నిహితులతో కలిసి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తాను వృత్తిరీత్యా డాక్టర్ని.. ఇప్పటివరకు 25 వేల ఆపరేషన్ చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయినని చెప్పారు.. రాబోయే రోజుల్లో డాక్టర్ గా ఉండాలా ప్రజాప్రతినిధిగా ఉండాలని నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారనీ తెలిపారు.
నియోజకవర్గ ప్రజల అభిమానం మేరకే నేను నడుచుకుంటా నన్నారు. తాను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరి అనుమతులు తీసుకొని రాలేదు ఇప్పుడు వైసీపీని వీడేటప్పుడు కూడా ఎవరి అనుమతులు తనకు అవసరం లేదన్నారు. కాగా, సంజీవ్ కుమార్ ను ఇటీవల వైసీపీ అధినాయకత్వం కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్చార్జి పదవి నుంచి తప్పించింది. అలాగే ఇక్కడ నుంచి గుమ్మనూరి జయరాంకు అవకాశం ఇస్తున్నారని వార్తలు వచ్చాయి .. ఈ కారణంగానే ఆయన మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ..