అమరావతి, ఆంధ్రప్రభ: ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పూర్తి స్థాయిలో జల్లెడ పడుతోంది.. గడప-గడపకు మన ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలోని 175 అసెంబ్లి స్థానాలు, 25 లోక్‌సభ సీట్లపై మూడు నెలలకోసారి ప్రశాంత్‌కిషోర్ నేతృృత్వంలోని ఐ ప్యాక్ టీంలు సర్వే నిర్వహించి నివేదికలను అందిస్తున్నాయి. అందుకు అనుగుణంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల గ్రాఫ్‌కు సంబంధించి ఐ ప్యాక్ తుది సర్వే అక్టోబర్‌లో సమర్పించనుంది. ఇప్పటి వరకు 18 మంది ఎమ్మెల్యేలు వెనుకబడినట్లు గుర్తించారు. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు కూడా సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. తీరు మార్చకోకపోతే మార్పు తప్పదనే సంకేతాలు కూడా అందించారు. ఈ నేపథ్యంలో ఈసారి గడప-గడపకు మన ప్రభుత్వం సర్వేలో ఎంతమంది అభ్యర్థులు గ్రాఫ్ నిలబెట్టుకుంటారనేది చర్చనీయాంశం గా మారింది. ఇదిలా ఉండగా కొన్ని చోట్ట ఎంపీలు అసెంబ్లిd సెగ్మెంట్ల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు అధిష్టానం వద్ద ప్రతిపాదనలు కూడా చేశారు. రాష్ట్రంలో గత కొద్దినెలలుగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించటంతో ఆ స్థానాల్లో ధీటైన అభ్యర్థులను బరి లో నిలపాలని భావిస్తున్నారు. ఈ రకంగా మొత్తం 25 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే టిక్కెట్‌తో పాటు కొందరు సిట్టింగ్ లకు ప్రత్యామ్నాయ నియోజకవర్గాలను కేటాయించాలని నిర్ణయించారు.
ఎంపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే టిక్కెట్లు, ప్రత్యామ్నాయ స్థానాల్లో ఆయా నేతలకు ఉన్న మైలేజీని ఇప్పటి నుంచే అంచనా వేసేందుకు సొంత సర్వే నిర్వహిస్తున్నట్లు వినికిడి. ఎంపీలను అసెంబ్లిd సెగ్మెంట్ల నుంచి పోటీ చేయించే స్థానాల్లో ప్రతిపక్ష టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నవి కూడా ఉండటం విశేషం. మచ్చుకు రాజమహేంద్రవరం ఎంపీ మారగాని భరత్‌ను ఈ సారి అసెంబ్లికి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి సతీమణిని నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయించాలని అక్కడ అధికార వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను వెంకటగిరి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేది పరిశీలన జరుపుతున్నారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ అసెంబ్లి స్థానానికి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇక్కడ పినిపె విశ్వరూప్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అదేవిధంగా సూళ్లూరు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను ఈ సారి గూడూరు నుంచి బరిలో నిలపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. గూడూరులో సిటింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ప్రత్యామ్నాయమా లేక ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలా అనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి ప్రత్యామ్నాయంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఇచ్చే అంశం కూడా పరిశీలనలో ఉంది.
ఇదిలా ఉండగా సిటింగ్ వారసులకు సీట్లిచ్చే విషయంలో కూడా సర్వే నిర్వహించాలనే యోచనతో పార్టీ అధినేత సీఎం జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలియవచ్చింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని తనయుడికి సీటు కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. అయితే సీఎం జగన్ మాత్రం నాని అభ్యర్థిత్వం పట్లే మొగ్గుచూపుతున్నారు. తనయుడికి సీటు ఇవ్వటం ద్వారా భవిష్యత్ విజయావకాశాలపై ఓ వౖౖెపు నానితో పాటు మరోవైపు పార్టీ అధిష్టానం కూడా సొంత సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి వయోభారం మీదపడటంతో పాటు అనారోగ్య కారణాల వల్ల ఆయన వారసునికి సీటిచ్చే ప్రతిపాదన ఉంది. మొత్తంగా ప్రత్యామ్నాయాల్లో అభ్యర్థుల మార్పు ద్వారా విజయావకాశాలు పరిశీలించి ఆపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.