( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, ఉల్లంఘనలకు పాల్పడి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ పేరుతో వైట్ కాలర్ నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
విజయవాడ లోని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దీనిపై స్పష్టమైన ఫిర్యాదు చేశారు. బజరంగ్ జూట్ మిల్లు ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరులో నిర్మిస్తున్న హైరేజ్ అపార్ట్మెంట్స్ పై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో హైరేజ్ (గ్రీన్ గ్రేస్ ) అపార్టుమెంట్ నిర్మాణంలో కండిషన్లు ఎలా ఉల్లంఘించారనే విషయాన్ని స్పష్టంగా పిసిబికి వివరించినట్లు చెప్పారు. పొల్యుషన్ బోర్డునుంచి కన్సన్ట్ తీసుకోకుండా భారీ ప్రాజెక్టును ప్రారంభించారని, ఉల్లంఘనలు జరిగితే ఈసీ ని రద్దు చేసే అధికారం పీసీబీ కి ఉంటుందన్నారు.
రైల్వే , వాటర్, ఫైర్ నిబంధనలకు విరుద్దంగా, అనుమతులు లేకుండా భారీ అపార్టుమెంట్ నిర్మించారని, చట్టపరమైన తీవ్ర ఉల్లంఘనలపై చేసినందున అపార్టుమెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
అపార్టుమెంట్ నిర్మాణ దారులు మద్యతరగతి నుంచి డబ్బు వసూలు చేసి వైట్ కాలర్ నేరం చేశారన్నారు. గత ఐదేళ్లలో ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడలేదని, తన అన్న ..మంత్రి అంబటి రాంబాబు ను అండ పెట్టుకుని అక్రమాలు చేశారన్నారు.
ఫీల్డ్ తనిఖీలు లేకుండా కళ్లు మూసుకుని ఐపీఎస్ అధికారి సంజయ్,మాదిరెడ్డి ప్రతాప్ ఇద్దరూ ఎన్ వోసీలు ఇచ్చారన్నారు. నిబంధనలకు విరుద్దంబృగా భారీ అపార్టుమెంట్లు నిర్మాణంపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.