Tuesday, November 19, 2024

AP | అవినీతి పోలీస్ ల‌పై కొరడా… ఐదుగురు సస్పెండ్ !

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : విధి నిర్వహణలో అలసత్వం, అవకతవకలు, అవినీతికి పాల్పడిన వారిపై ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ రాజశేఖర్ బాబు కొరడా జులిపిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి సారించిన ఆయన తన మార్క్ పాలనతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్టేషన్లను సందర్శించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేశారు.

ఇదే సమయంలో అవినీతికి పాల్పడుతున్న మరో ఐదుగురు సిబ్బంది పై తాజాగా సస్పెన్షన్ వేటు వేశారు. చెక్ పోస్ట్ లో విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో నిరూపితమైన నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ సిపి రాజశేఖర్ బాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు.

వివరాల్లోకెళ్తే… ఎన్టీఆర్ జిల్లా నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జొన్నల గడ్డ చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బంది అవకతవకులకు పాల్పడినట్లు విచారణలో తేలిన నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ సిపి రాజశేఖర్ బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏ ఆర్ ఎస్ ఐ బి రుద్రరాజు, ఏ ఆర్ హెచ్ సి కె నాగబాబు, ఏ ఆర్ కానిస్టేబుల్ ఎం అరుణ్ కుమార్, నందిగామ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు ఎం శివరామకృష్ణ ప్రసాద్, జంగా సృజనా కుమారులు ఉన్నారు.

మైలవరం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ కయ్యం నందిగామ శివారు సోమవారం గ్రామానికి చెందిన లారీ క్లీనర్ పల్లెబోగు కోటేశ్వరావు తో కలిసి బిలాస్పూర్ లో మిర్చి లోడ్ దిగుమతి చేసి, వచ్చిన రూ 25 లక్షల రూపాయల నగదుతో మధిరలోని రైతులకు ఇవ్వాల్సి ఉన్న సందర్భంలో పాల్వంచలో పని ఉందని చెప్పి మాయమాటలు చెప్పి కొద్దిసేపు మాయమయ్యాడు.

ఇదే సమయంలో డ్రైవర్ కయ్యం నందిగామలో లారీలో పెట్టిన డబ్బులు కనిపించడం లేదంటూ నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన నందిగామ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతని వద్ద నుండి రూ 18.52 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.

- Advertisement -

మిగిలిన నగదు గురించి విచారించగా జొన్నలగడ్డ చెక్ పోస్ట్ లోని సిబ్బందికి ఆరు లక్షల రూపాయలను చెల్లించినట్లు చెప్పాడు. దీనిపై విచారణ చేసిన కమిషనర్ వీరిని సస్పెండ్ చేయడంతో పాటు వారిని ముద్దాయిలుగా చేర్చుతూ కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో అలసత్వం గానీ అవినీతికి గాని పాల్పడితే ఎటువంటి వారైనా క్షమించేది లేదంటూ సిపి రాజశేఖర్ బాబు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement