కర్నూలు, (ప్రభ న్యూస్) : జిల్లాలో రైతుభరోసా, పీఎం కిసాన్ నిధులు అందక దాదాపు 75వేల మంది ఎదురుచూస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు పెట్టుబడి సహాయం అందిస్తున్నాయి. అన్నదాతలకు అందించే ఈ నిధులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆధార్ సమస్యలతో నిధులు అన్నదాతల చెంతకు చేరడం లేదు. పొలం, బ్యాంకు పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానమవుతున్నది. జిల్లాలో పొలం ఉన్న వ్యక్తులకు ఇతర ప్రాంతాల చిరునామాల్లో ఉంటే ఆధార్ లింకు కావడం లేదు. పొలం పేరుతో ఉన్న వ్యక్తులు చనిపోవడం, ఆధార్ సంఖ్య వినియోగంలో లేకపోవడం పలురకాల సమస్యలతో అన్నదాతలకు భరోసా దక్కడం లేదు.
జిల్లాలో 75వేల మంది దూరం..
వైఎస్ఆర్ రైతుభరోసా పెట్టుబడి సహాయం పథకం కింద 4.90లక్షల మంది రైతుల పెట్టుబడి సహాయానికి లబ్ది పొందగా, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ కింద 4.75లక్షల మంది సహాయం అందుతున్నది. దాదాపు 30వేల మంది కేంద్ర సహాయానికి దూరం అవుతున్నారు. పీఎం కిసాన్ పథకంలో 5.64లక్షల మంది రైతులు పేర్లు నమోదుచేసుకోగా ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాకు అనుసంధానం కాకపోవడం, ఎన్టిపిఏ ఆక్టివేషన్ లేకపోవడం, ఆధార్‌కు చరవాణి నంబర్ లింకు కాకపోవడం పలు కారణాలతో మరో 75 వేల మందికి సహాయం దక్కడం లేదు.
ప్రదక్షణలు చేస్తున్నా భరోసా దక్కదు..
జిల్లాలో రైతుభరోసా, పీఎం కిసాన్ నిధుల కోసం అన్నదాతలు ప్రదక్షణలు చేస్తున్నా భరోసా మాత్రం దక్కడం లేదు. 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూముల క్రయవిక్రయాలు జరిగినా రైతులు ఆన్లైన్, అడంగల్‌లో మార్పులు, చేర్పులు జరిగినా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరైన వారికి పీఎం కిసాన్ పెట్టుబడిసహాయం వర్తించడం లేదు. వేలాది మంది రైతులు కేంద్రం ఇచ్చే సహాయం పొందలేకపోతున్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత ఆర్‌బికెలు, మండల వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. జిల్లాలో మూడవ విడతలో వైఎస్ఆర్ రైతుభరోసా పీఎం కిసాన్ పథకం కింద 4.82లక్షల మంది కి లబ్ది చేకూరుతుంది. రూ.99.78కోట్లు విడుదలయ్యాయి. పీఎం కిసాన్ కింద 4.70లక్షల మందికి రూ.2వేల చొప్పున జమచేశారు. కౌలుదారులకు, అటవీ, దేవాలయ భూములు సాగుచేస్తున్న వారికి లబ్దిచేకూర్చింది. జిల్లావ్యాప్తంగా 75 వేల మంది పీఎం కిసాన్ కోసం ఎదురుచూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital