Thursday, November 21, 2024

రైతు సంక్షేమం ఏది..? : వేగుళ్ళ లీలా కృష్ణ

మండపేట, (ప్రభ న్యూస్‌) :రైతు ప్రభుత్వంగా చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తూట్లు పొడుస్తుందని మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ కనీస మద్దతు ధర అంశంలో అటు తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని ఇటు ఏపీ ప్రభుత్వం కనీసం మద్దతు ధర అంశంలో నోరు మెదపడం లేదని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల్ని వదులుకొని సొంత ప్రయోజనం కోసం వైసీపీ పాకులాడుతుందని దుయ్యబట్టారు.

కోతల సమయంలో ప్రకృతి ఉగ్రరూపం వల్ల ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి పాలు కాగా కొన్ని చోట్ల ధాన్యం రంగు మారిందన్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తిందని తెలిపారు. దీంతో దిక్కు తోచని పరిస్థితిలో రైతులు కుధేలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎన్ని ఎకరాల్లో పంట నష్టం సంభవించిందనే అంచనాలు కూడా జిల్లా యంత్రాంగం సిద్ధం చేయలేకపోయింది దుయ్యబట్టారు. ప్రస్తుతం కోతలు ముమ్మరంగా చేపట్టిన నేపద్యంలో తిరిగి వర్షాలు కురుస్తూ మరింత నష్టం పెరిగే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు.

తక్షణం ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర పెంచేలా కేంద్రం పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ పంపి ఇక్కడి పరిస్థితి వివరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తే ఇక్కడి రైతులు పరిస్థితి అర్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు సడలించి అన్ని రకాల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.మద్దతు ధర తదితర అంశాలపై రైతులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement