Tuesday, November 26, 2024

సూపర్ స్పేషాలిటీ సేవలు.. అందేదెప్పుడో..!

విజయవాడ సిటీ, ప్రభన్యూస్ : రాష్ట్ర విభజనకు ముందు అధునాతన వైద్యం కోసం ప్రజలు విజయవాడ నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌కు అధికంగా వెళ్లేవారు. దానికి ప్రత్యామ్నాయంగా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందుబాటులోనికి తీసుకురావాల‌ని భావించారు నాటి పాలకులు. కానీ నిర్మాణం ఆరంభమైనప్పటి నుంచి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఐదంతస్తుల్లో సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌ను రూ.150 కోట్లకు పైగా వెచ్చించి నిర్మించారు. ప్రారంభానికి సిద్దం అనుకుంటున్న సమయంలో కోవిడ్‌ రూపంలో ఆటంకం ఎదురవడంతో నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పుడు కోవిడ్‌ మూడో దశ ప్రారంభం కావడంతో సూపర్‌ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయో అన్న సందేహం వ్యక్తం అవుతోంది.

అందుబాటులోకి వచ్చే సేవలివే…
ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా సూపర్‌ స్పెషాలిటీ ద్వారా.. కార్డియో థొరాసిస్‌, అత్యవసర మెడిసిన్‌, చిన్నపిల్లలకు అవసరమైన పిడియాట్రిక్‌ సర్జరీ వంటి అధునాతన సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. వైద్య నిపుణులను నియమించాల్సి ఉంది. కొవిడ్‌కు ముందు దీని కోసం ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గిన నేపథ్యంలో సూపర్‌ స్పెషాలిటీ సేవలపై దృష్టి సారించాల్సి ఉంది.

వైద్య పరీక్షలన్నీ ఒకేచోట…
ఏటా 5లక్షల మందికి పైగా అన్ని రకాల వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారు. దీని కోసం సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లోని ఒకటో అంతస్తులో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలని గతంలోనే ఏర్పాట్లు చేశారు. బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సీటీ స్కాన్‌, డయాలసిస్‌ యూనిట్‌, ఎండోస్కోపి, ప్లnోరోస్కోపి, ఆల్ట్రాస్రౌండ్‌ గది, ఎక్స్‌రే యూనిట్లు- ఏర్పాటు- చేశారు. ఇవన్నీ పూర్తిగా అందుబాటులోకి వస్తే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో లభించే అన్ని సేవలు ఇక్కడే లభిస్తాయి.

2వేలకు పైగా ఓపీలు…
సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఒకవైపు సాధారణ, మరోవైపు కొవిడ్‌ సేవలకు ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఓపీకి రద్దీ భారీగా పెరిగింది. అదనపు కౌంటర్లతో కలిపి ఏడు వరకు ఉన్నప్పటికీ రోగుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటోంది. రోజుకు 2000 కు పైగా ఓపీలు ఉంటున్నాయి. కృష్ణాతో పాటు గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. సూపర్‌ సేవలను పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తే అధునాతన వైద్య పరీక్షలతో పాటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేసే రూ.లక్షల విలువైన శస్త్ర చికిత్సలు ఉచితంగా పేదలకు అందుబాటులోకి వస్తాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement