అమరావతి, ప్రభన్యూస్ : పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్ల సమగ్ర ఆమోదం సాంకేతికంగా అంత సులభతరం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్యాం డిజైన్ లో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు, సంస్థలు రూపొందించిన డిజైన్ ప్రతిపాదనలపై ఇంతవరకు ఏకాభిప్రాయం రాకపోవటమే దీనికి ప్రధాన కారణం. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్), ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన కమిటీ సైతం ఇంతవరకు డిజైన్లను కొలిక్కి తీసుకురాలేకపోయింది. కేంద్ర జలశక్తి ప్రత్యేకంగా నియమనించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్, రిటైర్డు ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో డిజైన్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. 2020లో గోదావరిలో వరద పోటెత్తింది. ఊహించని స్థితిలో 23 లక్షల క్యూసెక్కుల వరద ఉదృతికి అప్పటికే ఆమోదం పొంది నిర్మాణంలో ఉన్న డయాఫ్రం వాల్ దెబ్బతింది. నదీగర్భం కోతకు గురయింది. డయాఫ్రం వాల్ చుట్టూ సుడులు ఏర్పడి భారీ గొయ్యి ఏర్పడింది.
పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-2కు సమీపంలో కోతకు గురయిన నదీ గర్భాన్ని తిరిగి పటిష్ట స్థాయిలో పూడ్చటం ఇపుడు ఇంజనీరింగ్ నిపుణులకు సవాల్ గా మారింది. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మున్ముందు ప్రాజెక్టు దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్లనే ఈ విషయంలో కేంద్ర జలశక్తి ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫలితంగా గ్యాప్-2లో 550 మీటర్లు, గ్యాప్-1లో 1,750 మీటర్ల పొడవున ప్రధాన డ్యామ్ డిజైన్ల తుది ఆమోదం వాయిదా పడుతూ వస్తోంది. నీటిని తోడకుండానే గుంతలు ఉన్న ప్రదేశాల్లో పొరలు పొరలుగా ఇసుక వేస్తూ డెన్సిఫికేషన్ చేయటం వల్ల కోతకు గురయిన ఇసుకపొరలన్నీ పటిష్టమవుతాయని వెల్లడిస్తూ వైబ్రో కాంపక్షన్, డెన్సిఫికేషన్, స్టోన్ కాలమ్ విధానాలను వి.ఎస్ రాజు నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించింది. దీనిపై డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) చైర్మన్ ఏబీ పాండ్యతో పాటు మరికొందరు ఇంజనీరింగ్ నిపుణులు అనేక్ సందేహాలు లేవనెత్తారు. దీంతో ఇప్పటికే నిర్వహించిన సమావేశాలన్నీ అసంపూర్తిగా ముగియటంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో ప్రత్యేక బృందం కోతకు గురయిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 22, 23న పోలవరంలో పర్యటిస్తోంది.
కొలిక్కి వస్తుందా..!
అనేక సంప్రదింపుల తరువాత కోతకు గురయిన నదీ గర్భం ప్రాంతాన్ని పటిష్టం చేసి ప్రధాన డ్యాం డిజైన్ కు సమగ్ర ఆమోదాలపై చర్చించేందుకు పోలవరం పర్యటిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం తన వెంట (సీడబ్ల్యూసీ), డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్), ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై ఇంజనీరింగ్ నిపుణులను కూడా తీసుకువస్తున్నారు. 22న పోలవరాన్ని సందర్శించనున్న బృందం 23న రాజమండ్రిలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, మేఘా కంపెనీ ప్రతినిధులు కూడా నిపుణుల బృందం పర్యటనలో పాల్గొననున్నారు.
నదీగర్భం కోతను పూడ్చి పటిష్టం చేసే విధానంతో పాటు దానికయ్యే వ్యయంపైనా ఈ పర్యటనలో చర్చించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న నీటిని తోడేందుకయ్యే మొత్తం ప్రాజెక్టు విలువను సుమారు రూ.2,100 కోట్లుగా నిపుణులు నిర్దారించారు. అంతటి భారీ వ్యయాన్ని తగ్గించే మరో ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా రూపొందించారు. డ్రెడ్జింగ్‌తో ఇసుక కోత నివారించవ్చనీ, దీనికి రూ.880 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని మరో నివేదిక సిద్ధం చేశారు. ఈ రెండు విధానాలపైనా సమావేశంలో చర్చించనున్నారు. ప్రాజెక్టు భవిష్యత్, భద్రతా ప్రమాణాలే ప్రాతిపదికగా తీసుకునే నిర్ణయం పట్ల ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర జలశక్తి భావిస్తోంది. దీనిపై వివిధ దేశాల్లోని ప్రధాన జలవనరుల ప్రాజెక్టుల్లో సమస్య ఏర్పడినపుడు అనుసరించిన విధా నాలపైనా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్ సమస్య ఈ సమావేశాల్లోనే కొలిక్కి వస్తుందా.. మరికొంత సమయం పడుతుందా అనేది వేచి చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..