అమరావతి,ఆంధ్రప్రభ: ”నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో సొంత ఇళ్లు లేని ప్రజల కష్టాలను చూశాను. తమ నెలవారీ ఆదాయంలో 35-40 శాతం ఇంటి అద్దెకే ఖర్చు చేయడం వారికి పెద్ద భారం. అందుకే అవన్నీ మార్చాలని నిర్ణయించుకుని పేదలందరికి ఇళ్లు పథకం నవరత్నాల్లో భాగమైంది” అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చెప్పడమే కాదు చేతుల్లో చేసి చూపిస్తున్నారు. భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి రీతిలో దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వీటిల్లో మూడు దశల్లో కలిపి 28 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారు. మొత్తం 17 వేల జగనన్న కాలనీల్లో ఈ ఇళ్లను నిర్మించబోతున్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి దాదాపు 55 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారు. ఇవీ కాకుండా కాలనీల్లో మౌలిక సదుపాయాలైన మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ తోపాటు ఇతర సౌకర్యాల కోసం దాదాపు 33 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు.
మొదటి దశలో 15 లక్షల ఇళ్లు
మొదటి దశలో 15 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే దాదాపు లక్షా 70 వేల ఇళ్లను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జగనన్న కాలనీల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. లబ్దిదారులకు ప్రభుత్వం 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తోంది. అలాగే దాదాపుఉ 400 రూపాయలు ఉన్న సిమెంట్ బస్తాను 260 రూపాయలకే సరఫరా చేస్తోంది. అలాగే ఐరన్, స్టీల్ కూడా అందిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న మెటరీయల్‌ను ఉపయోగించుకొని ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ డిసెంబర్ నాటికి ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే బేస్‌మెంట్ లెవల్‌కు మూడు లక్షల ఇళ్లు చేరుకున్నాయి. 2024 మార్చి లోపు మొత్తం 28 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మహిళా సాధికారితకు పెద్ద పీట
పేదరికాన్ని రూపు మాపడానికి గృహనిర్మాణ పథకం ఒక సాధనంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాధికారత నిస్తుందని తలుస్తోంది. ఇది పేదలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. మహిళలేఈ పథకం యొక్క ప్రాథమిక లబ్ధిదారులు. ఈ పథకం వల్ల మహిళ ఇంటి యజమానిగా మారడంతో వారి సామాజిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే వారికి పేదరికం నుండి బయటపడేలా సహాయపడుతుంది. ఈ పథకం పేద కుటు-ంబాలకు మౌలిక సదుపాయాలను అందిస్తుంది.