Friday, November 22, 2024

కోస్తా రైలు మార్గానికి మోక్షం ఎప్పుడో? మచిలీపట్నం-రేపల్లె మార్గానికి రైలు బండి వచ్చేనా?

కష్ణా, ప్రభన్యూస్ : కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైనుకు ఈ సరైనా కేంద్ర బడ్జెట్‌లో మోక్షం కలిగేనా అనే దానిపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ రైల్వే లైనుకు సంబంధించి సర్వే పూర్తి చేసి అంచనాలు రూపొందించే కార్యక్రమంలో రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ రైల్వే లైనుకు సంబంధించి కొంత వాట రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే రెండు జిల్లాల ప్రజల కల సాకారమయ్యే అవకాశం ఉంది. 2008 నుంచి 2017 వరకు మూడుసార్లు సర్వే నిర్వహించి ఎట్టకేలకు పూర్తి చేశారు. అయితే బడ్జెట్‌లో నిధులు మాత్రం కేటాయింపు జరగలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో అయినా నిధులు కేటాయింపు జరిగేలా చూడాలి. ఆ దిశగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలపై వత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఈ రైల్వే లైన్‌ నిర్మాణం జరిగితే కోస్తతీర ప్రాంత అభివృద్థికి వడివడిగా అడుగులు పడతాయి.

ఈ రైల్వే లైన్‌ నిర్మాణం కోసం మాజీపార్లమెంట్‌ సభ్యులు బాడిగ రామకృష్ణ,కొనకళ్ళ నారాయణరావులు విశేష కృషి చేశారు. కాని కార్యరూపం దాల్చలేకపోయింది. కోస్తా లింకు రైలు మార్గానికి సంబంధించి కాకినాడ నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు నిర్మాణం జరగాల్సి ఉండగా ఇప్పటికే కాకినాడ -కోటిపల్లి -అమలాపురం -రాజోలు మీదుగా నర్సాపురం వరకు ఈ నిర్మాణం పూర్తయింది .మిగిలిన నరసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు కోస్తా లింకు నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రతి ఏడాది బడ్జెట్లో ప్రతిపాదనలు సిద్ధం చేయడం వాటికి బడ్జెట్లో చోటు దక్కకపోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి అందుకు ఆస్కారం లేకుండా తమ ప్రయత్నాలు ముమ్మరం చెశామని మచిలీపట్నం కోస్తా లింకు రైలు మార్గాల నిర్మాణ అభివృద్ధి కార్యాచరణ కమిటీ- నాయకులు కొక్కిలిగడ్డ కోదండ రామయ్య, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, రావి మణి శర్మ తదితరులు పేర్కొంటున్నారు.

నరసాపురం నుంచి బంటుమిల్లి మీదుగా మచిలీపట్నం వరకు 74 కిలోమీటర్ల మేర లింకు రైలు మార్గ నిర్మాణం జరగాల్సి ఉంది .ఇందుకుగాను 1540.62 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు 45 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 1151.63 కోట్ల రూపాయల అవుతుందని అంచనా వేశారు. వీటితో పాటు- రేపల్లె నుంచి నిజాంపట్నం మీదుగా బాపట్ల వరకు 45.81 కిలోమీటర్ల మేర లింకు రైలు మార్గం నిర్మాణానికి 792.33 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనాలు సిద్ధం చేశారు. మొత్తంగా నరసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు 164.84 కిలోమీటర్ల మేర జరగాల్సిన కోస్తా లింకు రైలు మార్గం నిర్మాణానికి 3,484.58 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ అంచనాలు, సర్వే నివేదికలు కేంద్ర రైల్వే బోర్డుకు చేరినట్టు- తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనల అంచనా వ్యయంలో కొంత మేర రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లయితే కేంద్ర బడ్జెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ దిశగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తీసుకురావాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement