Tuesday, November 26, 2024

Memories: తొలి ‘మ‌హానాడు’ ఎప్పుడు జ‌రిగింది.. ఆ విశేషాలేంటో తెలుసా!

తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటోంది. ఆ పార్టీ ప్రతినిధుల సభను మహనాడు అని పిలుచుకుంటారు. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహానాడులో ఈ సారి జోష్ కాస్త‌ ఎక్కువగానే ఉంది. అసలు మహానాడుకు ఆ పేరు ఎవరు పెట్టారు ? ఎప్ప‌టి నుంచి మహానాడు జరుగుతోంది అనే ఇంట్రెస్టింగ్ అంశాల‌ను ఓసారి ప‌రిశీలిద్దాం..

తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ అధికారం చేపట్టారు. ఆ తర్వాత పార్టీ సభను నిర్వహించాలని నిర్ణయించారు. దానికి మహానాడు అని పేరు పెట్టారు ఎన్‌టీఆర్‌. కానీ, ఆ పేరు అప్పటి టీడీపీ నేతలకు చాలా విచిత్రంగా అనిపించింది. మహానాడు అంటే సమావేశమా? వేడుకా? బహిరంగ సభనా అని చాలా మంది నేతలకు అర్థం కాలేదు. కానీ ఎన్టీఆర్‌ను నేరుగా అడిగే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అందుక‌ని ఏర్పాట్లు ప్రారంభమైన తర్వాత పసుపు పండుగ అని అంద‌రూ అర్థం చేసుకున్నారు.

తొలి మహానాడు జరిగింది ఎక్క‌డంటే..
హైదరాబాద్‌లో పార్టీని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించిన ఎన్‌టీ రామారావు మొదటి మహానాడును మాత్రం గుంటూరులో జ‌ర‌పాల‌ని నిర్ణయించారు. గుంటూరులోని శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ స్టేడియంలో తెలుగుదేశం పార్టీ ప్రథ‌మ మహాసభ జరిగింది. చివరి రోజైన మే 28న భవానీపురం మీదుగా బందర్ రోడ్డు దాకా బ్రహ్మండమైన ఊరేగింపు జరిగింది. అదే రోజు సాయంత్రం శాతవాహన్ నగర్ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్ కోటలు బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్ కు దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.

జాతీయ స్థాయి దిగ్గజ నేతల రాక‌..
సాధారణంగా పార్టీ సభ అంటే.. ఆ పార్టీ నేతలే హాజరవుతారు. ఇతర పార్టీల నేతలు రారు. కానీ తెలుగుదేశం పార్టీ తొలి మహానాడుకు మాత్రం జాతీయ నేతలంతా వ‌చ్చారు. అప్పట్లో అగ్రనేతలుగా ఉన్న ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు , ఎల్ కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్ పేయ్, రామకృష్ణ హెగ్డే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, మేనకాగాంధీ కూడా హాజరయ్యారు. అప్పట్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న అందరూ మహనాడు వేదిక మీదకు వచ్చారన్నమాట. అంటే తొలి అడుగులోనే టీడీపీ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది.

అతిథి మర్యాదలకు లోటురాకుండా అప్పట్నుంచే..
టీడీపీ మహానాడు అంటే.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఓ ప్రత్యేకమైన అనుభూతి మిగులుతుంది. ఎందుకంటే అతిథి మర్యాదలు ఆ స్థాయిలో ఉంటాయి మరి. పసందైన వంటకాలు.. వచ్చిన వారందరికి బస ఏర్పాటు చేయడం వంటివి పార్టీ చూసుకుటుంది. తొలి మహానాడు నుంచే ఇది జరుగుతోంది. అప్పట్లో ప్రతినిధుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్మించారు. మహానాడుకు వచ్చిన జాతీయ నేతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫొటో ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలతో తొలి మహానాడు అద్భుతంగా సాగిందని చెబుతూంటారు. ఆ ఒరవడితో అధికారంలో ఉన్నా లేకపోయినా.. మహానాడును తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికీ సంబురంగా నిర్వహిస్తూ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement