నారావారి పల్లె – జనవరి 18న వాట్సాప్ గవర్నెర్స్ తీసుకురాబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 సర్వీసులు ఆన్‌లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా ఆన్‌లైన్ ద్వారా వీటిని ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విధానంతో ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా, సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబసమేతంగా నారావారిపల్లెకు ముఖ్యమంత్రి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.భారతదేశంలో 64 లక్షల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ప్రజలకు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ అనేవే కూటమి ప్రభుత్వ లక్ష్యాలని సీఎం చెప్పారు. పేదరికం, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా 199 అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తు్న్నామని అన్నారు. రాష్ట్రంలో పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరాకు సైతం శ్రీకారం చుట్టినట్లు చెప్పుకొచ్చారు.
సంక్రాంతి సందర్భంగా వివిధ వర్గాలకు పెండింగ్‌లో ఉన్న రూ.6700 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది పల్లెలకు పండగ కళ వచ్చిందని, గత ఏదేళ్లలో ప్రజలు కనీసం పండగలు ప్రశాంతంగా చేసుకోలేకపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే సంప్రదాయాన్ని నారా భువనేశ్వరి పాతికేళ్ల క్రితమే ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ప్రతి పల్లె, ప్రతి ఇల్లూ సంతోషంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఆయన చెప్పారు. అందుకే స్వర్ణాంధ్ర విజన్-2047కి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం, ఆరోగ్యం పెరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రతి కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతికి ముందే 4.56 లక్షల మంది రైతులకు ధాన్యం డబ్బు చెల్లించామని చెప్పారు. ప్రధాని మోదీ ఇటీవల రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే పీ-4 విధానానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని, ఏ వర్గాన్నీ విమర్శించకుండా ముందుకెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
నాగాలమ్మ ఆలయంలో పూజలు
నాగాలమ్మ ఆలయంలో చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. నాగాలమ్మ పూజల్లో నారా వంశీకులు పాల్గొన్నారు.
నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి నారా చంద్రబాబు నాయుడు,లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిని, దేవాన్ష్, ఎంపీ భరత్ ఆయన సతీమణి తేజస్విని, తదితరులు మొక్కులు చెల్లించుకున్నారు. నాగాలమ్మ వద్ద పూజల అనంతరం తీర్థప్రసాదాలను కుల పెద్దలు అందజేశారు. నాగాలమ్మ పుట్టకు నూలుపోగులు చుట్టి , పాలను నైవేద్యంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మిని తదితరులు సమర్పించారు.
మహిళలు పూజల్లో ఉండగా నాగ దేవతల సమీపంలోనే మనవళ్లతో చంద్రబాబు గడుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
మకర సంక్రాంతి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని చంద్రబాబు అన్నారు. మన పల్లెలు.. పాడిపంటలతో మరింత కళకళలాడాలని సీఎం చంద్రబాబు కోరుకున్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంప్రదాయాలు మరిచిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు.ఊరి పెద్దలతో ముచ్చటించారు.
నాగ దేవతల ప్రసాదాలను నారా, నందమూరి కుటుంబాలు స్వీకరించాయి. నారా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు – అమ్మనమ్మ సమాధులు వద్దకు చేరుకుని చంద్రబాబు కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. అనంతరం నారావారిపల్లిలోని ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.