Saturday, November 23, 2024

Gravel: ఇదేమి దోపిడీ రామా.. రామదాసు కండ్రిగలో గ్రావెల్ త‌వ్వ‌కాలు..

ఖనిజ సంపద దోపీడీని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు క ఠిన నిర్ణయాలను, కొత్త చట్టాలను తీసుకొస్తున్నా.. మరోవైపు మాఫియా కొత్త మార్గాలను అనుసరిస్తూ విలువైన గ్రావెల్‌ను దోచుకుంటోంది. ఇంత జరుగుతున్నా.. స్థానిక అధికారులు కానీ, జిల్లాస్థాయిలో మైనింగ్‌ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు తెలి సే మాఫియా గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతోందా అన్న సందేహాలు కూడా పలువురిలో వ్యక్తమవుతున్నాయి.

ప్రభ న్యూస్‌ బ్యూరో , నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని రామదాసు కండ్రిగ గ్రామ పరిధిలో జరుగుతున్న గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను ఒకసారి పరిశీలిస్తే పై సందేహాలు, అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. వాస్తవానికి రామదాసు కండ్రిగలో గ్రావెల్‌ తవ్వకానికి సంబంధించి మైనింగ్‌ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. అయితే మాఫియా తమ దోపీడీని కప్పి పుచ్చుకునేందుకు గ్రావెల్‌ను రాజమార్గంలోనే తవ్వుకునేందుకు మొక్కుబడిగా నాలుగు ఎకరాలకు సంబంధించి తవ్వకాలు పూర్తి అయిన తర్వాత అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ మొక్కుబడి అనుమతులతోనే సమీపంలోని మరో నాలుగు ఎకరాల్లో రెండో క్వారీని ఏర్పాటు చేసి గ్రావెల్‌ను తవ్వుతున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్‌ తవ్వకాలతో పాటు అందుకు సంబంధించిన అనుమతుల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. సుమారు రూ. 2.5 కోట్ల విలువైన గ్రావెల్‌ను మనుబోలు మండలంలోని కుమ్మరపూడి రైల్వేలైన్‌ పనులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

అనుమతి లేకుండానే తవ్వకాలు
నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు సంబంధించి అనుమతులు కావాలంటే సంబంధిత శాఖలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు సంబంధించి కొంత మొత్తాన్ని ముందుగా ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ తర్వాత మైనింగ్‌ అధికారులు సూచించిన విధంగా రెండు నుంచి రెండున్నర అడుగుల మేరకు మాత్రమే తవ్వకాలు జరపాలి. అంతకుమించి అరడుగు తవ్వినా.. అది నిబంధనలకు విరుద్ధమే అవుతోంది. అయితే రామదాసు కండ్రిగ గ్రామ పరిధిలో జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలను పరిశీలిస్తే ఒక్కో క్వారీలో పది నుంచి పదిహేను అడుగుల లోతు తవ్వకాలు జరిపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం. చట్టరీత్యా కూడా నేరం. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ నిబంధనలకు రామదాసు కండ్రిగలో తూట్లు పడుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు మౌనంగా ఉండటం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ గ్రావెల్‌ మాఫియా ఇచ్చే మామూళ్లతో సరిపెట్టుకున్న అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

మరో క్వారీలో తవ్వకాలు పూర్తయ్యాక .. అనుమతులు
రామదాసు కండ్రిక పరిధిలో నాణ్యమైన గ్రావెల్‌ ఉంది. దీంతో కొంతమంది మాఫియాగా ఏర్పాటై సమీపంలో జరుగుతున్న రైల్వేలైన్‌ పనులకు మట్టి గ్రావెల్‌ను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో గ్రామ పరిధిలో నాలుగు ఎకరాల్లో ఇష్టానుసారంగా వేల క్యూబిక్‌ మీటర్లు గ్రావెల్‌ను తవ్వి రైల్వే పనులకు తరలిస్తున్నారు. అయితే తవ్వకాలు దాదాపుగా పూర్తి అయిన తర్వాత మొక్కుబడిగా అనుమతులు తీసుకున్నారు. అది కూడా చాలా తక్కువ మొత్తంలో ప్రభుత్వానికి చెల్లించారు. పెద్ద ఎత్తున ఖనిజ సంపదను దోచుకున్నారు. అది చాలదన్నట్లుగా అవే అనుమతులతో సమీపంలో మరో నాలుగు ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలను చేపడుతున్నారు. ప్రస్తుతం అనుముతులు లేని ఆ క్వారీ నుంచి పెద్ద ఎత్తున గ్రావెల్‌ను గొలగమూడి, వెంకటాచలం, కొమ్మరపూడి, తదితర ప్రాంతాల్లో జరిగే రైల్వేలైన్‌ పనులకు తరలిస్తున్నారు. అయితే అంతపెద్ద ఎత్తున గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నా.. సంబంధిత అధికారులు మౌనంగా ఉండటం గమనార్హం. రామదాసు కండ్రిగ గ్రావెల్‌ తవ్వకాలపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపడితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement