Friday, November 22, 2024

Big Story | సీఎం విస్తృత పర్యటన వెనుక మర్మమేంటి?.. ముందస్తుకు ముఖ్యమంత్రి జగన్?!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలతో కాకుండా కొద్ది నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిపినట్టయితే అటు వైఎస్సార్సీపీకి, ఇటు బీజేపీకి ప్రయోజనకరంగా ఉంటుందన్న అంచనాలతో ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిందా లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుకు సమాయత్తమవుతుందా అన్న విషయంపై స్పష్టత లేదు.

అధికారికంగా ఏ ఒక్కరూ ఈ విషయంపై స్పందించలేదు. ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మొత్తంగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేపట్టి సాయంత్రానికి మళ్లీ తిరిగి వెళ్లిపోయారు. పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు మరికొందరు అధికారులతో కలిసి మధ్యాహ్నం గం. 3.00 సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ఆయన నివాసంలో కలిసిన ముఖ్యమంత్రి అర గంటకు పైగా ఆయనతో చర్చలు జరిపారు.

అనంతరం సాయంత్రం గం. 4.30 సమయంలో ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ గంటకు పైగా సాగింది. అక్కణ్ణుంచి నేరుగా నార్త్ బ్లాక్‌లో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిశారు. ఆమెతో అర గంట పాటు చర్చలు జరిపిన జగన్, అటు నుంచి నేరుగా విమానాశ్రయానికి బయలుదేరారు.

కేంద్ర ప్రభుత్వంలో ముగ్గురు కీలక నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్‌ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉందని జగన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు, తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుందని, ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. పోలవరం తొలిదశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, అయితే తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్టని ప్రధానికి వివరించారు. మొత్తంగా పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17144 కోట్లు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈమేరకు జలశక్తి శాఖకు ఆదేశాలివ్వాలని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.1310.15 కోట్లను వెంటనే రీయింబర్స్‌ చేయాలని ప్రధానిని అడిగారు.

విద్యుత్ బకాయిలు-ఆహార భద్రత అమల్లో లోపాలు
2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిలు ఇంకా పెండింగులో ఉన్నాయని జగన్మోహన్‌రెడ్డి ప్రధానికి చెప్పారు. ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల రూపాయల చెల్లింపులు సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయని, ఏపీ జెన్‌కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ బకాయిలు వచ్చేలా దృష్టి పెట్టాలని వినతి చేశారు. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని ఆయన మరోసారి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద కనీసం కంటే అధికంగా కవరేజీ అందుతోందని, పథకం అమలుకు ఎంచుకున్న ప్రమాణాల్లో హేతుబద్ధత లేదని పీఎంకు వివరించారు. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్ర రేషన్‌ అందకపోవడం వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోందని, ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు. ఏపీ పౌరసరఫరాల శాఖకు సుదీర్ఘకాలంగా (2012-13 నుంచి రూ. 2017-18 వరకూ) పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరు చేయాల్సిందిగా ప్రధానమంత్రిని కోరారు.

విభజన హామీల మాటేంటి
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా పెండింగులో ఉన్న హామీల గురించీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రితో చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహదపడుతుందని, రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ఈమేరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టామని, వాటికి తగిన ఆర్ధిక సహాయం చేయాలని కోరారు. వైఎస్సార్‌ కడప జిల్లాలోని స్టీల్‌ప్లాంట్‌కు అత్యంత అవసరమైన ముడి ఖనిజం కోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించేలా గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధానమంత్రికి ఆయన వినతి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement