పుంగనూరు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): జగన్ ప్రభుత్వంపై నిన్న, మొన్న బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల వెనుక ఆ పార్టీలో ఉన్న చంద్రబాబు కోవర్టులే ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం సాయంత్రం ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, మైనారిటీ ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఆ సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయని, అందులో సీఎం జగన్ పేదలకు మంచి చేస్తే నచ్చని వాళ్లంతా కలుస్తున్నారన్నారు.
పేదలకు మంచి చేసినందుకు అవినీతి ప్రభుత్వం అని బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీ రామారావును మోసం చేసి పార్టీని, పార్టీ గుర్తును లాక్కున్నారని, నిజానికి వాళ్లంతా కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వారే తప్ప, ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలోని వారు ఎవరూ లేరని ఏద్దేవా చేశారు. మొన్న శ్రీకాళహస్తిలో, నిన్న విశాఖలో అవినీతి ప్రభుత్వం అని బి జె పీ నాయకులు విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ టిడిపి హయాంలో మాత్రమే అవినీతి జరిగిందని, తాము రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో వివిధ పథకాల ద్వారా చెల్లించామని చెప్పారు.
చంద్రబాబు బిజెపికి పంపించిన కొందరు కోవర్టుల కారణంగానే వైసిపికి అవినీతిని అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 20 పార్లమెంట్ సీట్లు గెలవాలని కొందరు అనడాన్ని ప్రస్తావిస్తూ .. వైసిపి 25 ఎంపీ సీట్లు సాధిస్తుందని, అసెంబ్లీలో గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఈ సభలో ఆయనతో పాటు ముఖ్య అతిథులు గా డిప్యూటీ సిఎం కే. నారాయణ స్వామి, మంత్రి మేరుగు నాగార్జున, ఎంపి
ఎన్ రెడ్డప్ప, ఎమ్మెల్సీ కే.ఆర్.జే భరత్, ఎమ్మెల్యే లు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, నవాజ్ బాషా, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు పాల్గొన్నారు.