రాయలసీమ డిక్లరేషన్ అని, గ్యాస్ సిలిండర్ల డిక్లరేషన్ అంటూ ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు గాడిదలు కాసారా ? అని సీఎం జగన్ నిలదీశారు. పల్నాడు జిల్లాలోని క్రొసూరులో సీఎం జగన్ విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బతుకంతా వాగ్ధానాలు, వెన్నుపోట్లేనని ఏపీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామస్థాయిలో అనేక వ్యవస్థలను ఏర్పాటు చేశామని.. ఇళ్ల స్థలాల నుండి దిశ యాప్ వరకు వైసీపీ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడిందని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు మహిళలకు, రైతులకు, యువతకు, ఎస్సీ-బీసీ వర్గాలకు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడని.. కానీ ఎన్నికల తర్వాత మోసం చేశాడని ఆరోపణలు చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఈ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసం, కుట్ర, దగా గుర్తుకువస్తాయే తప్ప.. ఒక్క పథకం కూడా గుర్తుకు రాదన్నారు. చంద్రబాబును కాపాడేందుకు దుష్టచతుష్టయం అండగా ఉందని, బాబు ఏం చేసినా సమర్థించే దత్తపుత్రుడు ఉన్నాడని పేర్కొన్నారు. టీడీపీ మూసివేయడానికి సిద్ధంగా ఉన్న ఓ దుకాణమని, అందులో పక్క రాష్ట్రాల బిస్మిల్లా బాత్, కిచిడీలు అమ్మడానికి చంద్రబాబు సిద్ధమయ్యాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బాబు వల్ల మేలు జరిగిందని చెప్పే ఒక్క ప్రాంతమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేని వ్యక్తి చంద్రబాబు అని, పేదలకు వ్యతిరేకంగా ఉండే పెత్తందారీ పార్టీ చంద్రబాబుది అని విమర్శించారు. చంద్రబాబు బతుకే మోసం, అబద్ధం, పెత్తందారి అని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు వాగ్ధానం, తర్వాత మోసం చేయడమే చంద్రబాబు నైజమని ఆరోపించారు. చంద్రబాబు అంటే వెన్నుపోటు, కుట్ర, దగ అని.. ఆయన జీవితమే మోసం, పచ్చి అబద్ధమని దుయ్యబట్టారు. పేద ప్రజలకు ఇంగ్లీష్ విద్య వద్దు, వాళ్ళ చేతుల్లో టాబ్‌లు ఉండకూడదన్నది చంద్రబాబు మనస్తత్వమని ఫైరయ్యారు. ఇప్పుడు పేదలు, బీసీలు గుర్తుకు వచ్చారా ? అని అడిగారు. తాను అధికారంలోకి వస్తే.. కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానని చంద్రబాబు మోసపు మాటలు చెప్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు వాగ్ధానాలు, వెన్నుపోట్లు అనేది ఒక సైకిల్ చక్రమన్నారు.