Wednesday, November 20, 2024

మ‌త్స‌కారుల వ‌ల‌కు చిక్కిన‌.. వేల్ షార్క్.. మ‌రి దాన్ని ఏం చేశారు..

విశాఖపట్నం, ప్రభ న్యూస్‌: విశాఖ ఎన్‌టీపీసీ దగ్గరలో గల సముద్ర తీరం తంతాడి బీచ్‌లో స్థానిక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా వలలో పెద్ద చేప చిక్కుకున్నట్టు గుర్తించారు. ఈ సమాచారాన్ని ఒక వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ అటవీ శాఖ అధికారులకు తెలియజేయగా డీఎఫ్‌వో అనంత శంకర్‌ ఆదేశాల మేరకు అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని ఆ చేప ప్రపంచంలో పెద్ద చేపల జాతికి చెందిన షార్క్‌ చేపగా గుర్తించారు. ఈ చేపలు అంతరించిపోతున్న జాతుల్లో ఒకటని డీఎఫ్‌వో పేర్కొన్నారు. దాని ప్రాణానికి ఇబ్బంది లేకుండా సురక్షితంగా సముద్రంలోనికి పంపించాలని డీఎఫ్‌వో అధికారులను ఆదేశించారు. దీనితో అటవీ అధికారులు, స్థానిక మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకుల సమన్వయంతో రెండు టన్నుల బరువు గల వేల్‌ షార్క్‌ చేపను తీవ్రంగా కష్టపడి సజీవంగా లోతైన సముద్రజలాల్లోకి పంపించేశారు.

అంతరించిపోతున్న షార్క్‌ చేపను మళ్లి సజీవంగా సముద్ర జలాల్లోకి పంపించడం ఆనందంగా వుందని డీఎఫ్‌వో శంకర్‌ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయినప్పుడు వాటిని సజీవంగా వుండేలా చూస్తూ అటవీ శాఖ అధికారులకు తెలియ జేయాలని డీఎఫ్‌వో సూచించారు. అంతరించిపోతున్న చేపలను కాపాడే ప్రయత్నంలో చేపల వలలకు ఏదైనా నష్టం కలిగితే నష్టపరి హారం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement