ఏలూరు రూరల్ : శ్రీ కృష్ణ ఫౌండేషన్.. లక్ష్మీ ఫౌండేషన్ పేరుతో వసూళ్ల దందా కొనసాగుతోంది. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో జిల్లా కేంద్రాలుగా నగరాలలో వారానికి రెండు రోజులు ఈ ఫౌండేషన్ల పేరుతో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. గత నెలలో ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురించిన సరికొత్త దందా అనే వార్తకు అమ్మ చేయూత ఫౌండేషన్ సంస్థ ద్వారా దందాకు పాల్పడుతున్నారని ప్రచురించిన వార్తకు.. నెల రోజులు విరామం ఇచ్చి కొత్తగా శ్రీకృష్ణ ఫౌండేషన్, లక్ష్మీ ఫౌండేషన్ పేరుతో నకిలీ ఐడీ కార్డులతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏలూరు నగరంలో పాత బస్టాండ్ సిగ్నల్ దగ్గర లక్ష్మీ ఫౌండేషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకోగా.. నెలకు 15 వేలు వేతనానికి సిబ్బందిని నియమిస్తారని తెలిపారు. వాహనాదారులు నిలిచి ఉన్న ప్రాంతాలలో ఏలూరు నగరంలో సిగ్నల్స్ దగ్గర కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్ సమీపంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో వాహనదారుల వద్ద వసూలు చేస్తున్నామన్నారు. మాకు ఉద్యోగంలో చేరేముందు పది రోజులు ట్రైనింగ్ ఉంటుందని, ఆ పది రోజులు ట్రైనింగ్ లో భాగంగా వసూళ్లు ఎలా చేయాలనే విధంగా ప్రముఖులు ట్రైనింగ్ ఇస్తారన్నారు.
రాష్ట్రంలో సుమారు వందల సంఖ్యలో మా సిబ్బంది ఉన్నారని ప్రముఖ నగరాల్లో వసూలు చేయాలని మమ్మల్ని ఉద్యోగాల్లో నియమించిన అధికారులు చెప్పారన్నారు. వారానికి ఒకసారి వచ్చి మా దగ్గర వసూలు చేసిన డబ్బులు తీసుకువెళ్తారన్నారు. వేరే ఉద్యోగం లేక మా పిల్లల భవిష్యత్తు కోసమే ఈ వృత్తిని ఎంచుకున్నామని ఈ ఫౌండేషన్ సంస్థలో ఉద్యోగం మానేద్దాం అన్నా సంవత్సరం కాలం పాటు మాకు తెలియకుండానే అగ్రిమెంట్ చేయించుకున్నారన్నారు. ఎవరు ఎదురు తిరిగిన చంపేస్తామనే బెదిరింపులకు ఫౌండేషన్ యజమానులు తిరగబడతారన్నారు. ఆ భయంతోనే ఈ ఉద్యోగం చేస్తున్నామన్నారు. సకాలంలో జీతాలు కూడా చెల్లించరని తెలిపారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా పలు ఫౌండేషన్ పేరుతో రోజుకు ఒక సిబ్బందిని మారుస్తూ బెదిరింపులకు గురి చేస్తూ వాహనదారుల దగ్గర సామాన్య ప్రజల దగ్గర దందా చేస్తున్నారు. కొంతమంది వాహనదారులు మాట్లాడుతూ.. అసలు పోలీసులు దీనిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదని, డబ్బులు ఇచ్చే అంతవరకు వాహనాలుకు అడ్డు వచ్చి డబ్బులు ఇస్తే గాని వాహనాలను వదలటం లేదంటున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అధికారులు చొరవ చూపి ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వాహనదారులు తెలిపారు.