నర్సాపురం, జూన్ 21 ప్రభ న్యూస్ : నర్సాపురం ఎమ్మల్యే బొమ్మిడి నాయకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వినూత్నరీతిలో అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకర్ మత్స్యకార వేషధారణతో వచ్చి ఆకర్ష నీయంగా నిలిచారు. నెత్తికి పార్టీ కండువా చుట్టి…పంచే కట్టు కట్టి….చేపల వల చేత బట్టి…..నడుముకు తాటాకు బుట్ట కట్టుకుని సాంప్రదాయ మత్స్యకారునిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు గతంలో ఒకరు ఇద్దరు నేతలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఇటువంటి గెటప్ లతో శాసనసభకు రాలేదు. నర్సాపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాత్రమే సాంప్రదాయ మత్స్యకారునిగా వినూత్న రీతిలో అసెంబ్లీకి అడుగు పెట్టడం విశేషంగా నిలిచింది.
మత్స్యకారుడుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ను ఆ పార్టీ నేతలతో పాటు తెలుగుదేశం, బీజేపీ సభ్యులు అభినందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున బొమ్మిడి నాయకర్ భారీ మెజార్టీతో విజయం సాధించి సరికొత్త రికార్డ్ సాధించారు. రికార్డు స్థాయిలో గెలవడమే గాకుండా మత్స్యకార వేషధారణతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావటం కూడా సరికొత్త రికార్డ్ అంటూ పలువురు ప్రజాప్రతినిధులు నాయకర్ ను అభినందించడం గమనార్హం.
కులం… నా గెలుపులో కీలకం…
మత్స్యకార సామాజిక వర్గానికి జనసేన పార్టీ అదినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెద్దపీట వేసి రాష్ట్ర స్థాయిలో తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. మత్స్యకా రుడుని కాబట్టే నర్సాపురం శాసనసభ్యుడుగా తనకు సీటు కేటాయించారు. సీటు కోసం ఎంతమంది ప్రయత్నించినా ఫలించలేదు. మత్స్యకారుల పట్ల పవన్ కల్యాణ్ కున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మత్స్య కారులంతా ఏకతాటి పైకి వచ్చి తనకు అఖండ విజయం చేకూర్చారు. అందుకే నా గెలువు నా జాతికి అంకితం ఇస్తూ ఈ రోజు శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మత్స్యకారుడుగా అడుగా పెట్టా. నియోజకవ్గం అభివృద్దితో బాటు అన్ని రకాలుగా అట్టడుగు స్థాయిలో ఉన్న మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా సేవలందించి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చు కుంటానని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు.