భీమవరం, (ప్రభన్యూస్ ప్రతినిధి) : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కుట్రలపై ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు భీమవరంలోని తన నివాసంలో 24 గంటల పాటు నిరసన దీక్షకు శనివారం కూర్చున్నారు. తనను బయటకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ… వైసిపి అంతటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏదీ లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఏదో కుట్ర జరిగిందంటూ క్రియేట్ చేసి చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
2020 సంవత్సరంలో ఇదే కంపెనీకి ఈ ప్రభుత్వం అవార్డు ఇచ్చిందన్నారు. న్యాయస్థానాలు ఒకలా సూచనలు చేస్తుంటే, జగన్ చట్టం మరోలా రాష్ట్రంలో వ్యవహరిస్తుందన్నారు. జగన్ ఆదేశాలకు అనుగుణంగానే పోలీసు వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే నోటీసు ఇవ్వాలా, ఎంక్వైరీ పిలిపించుకోవాలా, తప్పు ఉందని నిర్ధారణ జరిగితే అరెస్ట్ చేయాలా అని రామరాజు అన్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని జగన్ కు హెచ్చరిక చేస్తున్నానని, రాబోవు రోజుల్లో అన్ని అనుభవిస్తారని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును విడుదల చేయకపోతే నిరసన కార్యక్రమాలను పెంచుతామన్నారు. భీమవరంలోని లోకేష్ పాదయాత్రలో కూడా ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న జగన్ ప్రభుత్వం రాబోవు రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.