చోడవరం, జనవరి29(ప్రభన్యూస్): ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కొందరు నాయకులు చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న చెరువులో స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుండడంతో జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇంఛార్జీ పి.వీ.ఎస్.ఎన్ రాజు ఆధ్వర్యంలో ఆందోళన జరిపారు.
ఈ సందర్భంగా జనసేన ఇంఛార్జి పి.వీ.ఎస్.ఎన్ రాజు మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరు చాలా దారుణంగా ఉందని చివరికి చెరువులను సైతం గ్రావెల్ తో కప్పివేసి ఆక్రమిస్తున్నారని ఇది చాలా దారుణం అని ప్రజలకు అవసరమైన వాటికే ఈ స్థలాన్ని వినియోగించాలని వ్యాపారంగా చేయాలని, దుకాణాలు కట్టి అద్దెలకు ఇవ్వాలని చూస్తే సహించేది లేదన్నారు. గతంలో ఆర్టీసీ డిపో కోసం దేవదాయ శాఖ ఆ స్థలాన్ని ఇచ్చిందని, చెరువును కప్పి డిపో కడితే దానిపై ఆధారపడిన రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడతారని ఆలోచించి ఆర్టీసీ డిపో కాకుండా పాయింట్ పెట్టారని అందువల్లనే కాంప్లెక్స్ వచ్చిందని, ఆ మిగిలిన స్థలాన్ని కొందరు వ్యక్తులు వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలని చూస్తున్నారని, ఇది చాలా దారుణమని వ్యాపారం తీసుకుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. చోడవరంలో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని, ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తేనే ఆ నాయకులకు మునుగడ ఉంటుందని ప్రజలు చూస్తూ ఊరుకోరని రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జనసేన రాజు హెచ్చరించారు. ఈ ఆందోళనలో వైసిపి నాయకులు గూనూరు మూలునాయుడు, కర్రి రమేష్ తదితరులు భారీగా పాల్గొన్నారు.