అనంతపురం – పశ్చిమ రాయలసీమలో మాత్రం వైకాపా, తెదేపా పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి రౌండ్‌లోనూ తెదేపా, వైకాపా బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. అనంతపురం జేఎన్‌టీయూలో గురువారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం కూడా కొనసాగుతోంది. 11 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. మొత్తంగా 2,45,687 ఓట్లు పోలైనట్టు గుర్తించారు. వీటిలో 2,26,448 ఓట్లు చెల్లుబాటు అయినట్టు తేల్చారు. మొత్తం ఓట్లలో 19,239 ఓట్లు చెల్లనివిగా పరిగణించారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో.. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు. ఈ స్థానంలో మొత్తం 49మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు కనిష్ఠంగా ఓట్లు పొందిన అభ్యర్థుల ఓట్ల లెక్కింపును సిబ్బంది పూర్తి చేశారు. 16మంది అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపును పూర్తి చేయగా.. ఇంకా 25మంది అభ్యర్థులు మిగిలారు. 16మంది ఓట్ల లెక్కింపు తర్వాత వైకాపా అభ్యర్థికి 96,054 ఓట్లు రాగా, తెదేపా అభ్యర్థికి 94,262 ఓట్లు వచ్చినట్టు వెల్లడించారు. దీంతో తెదేపా బలపరిచిన అభ్యర్థి కంటే వైకాపా అభ్యర్థి కేవలం 1,792 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.