ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సారథులు వాలంటీర్లు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన మూడో ఏడాది ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… వాలంటీర్ల వ్యవస్థ ఓ మహాసైన్యమన్నారు. జగన్ పెట్టుకున్న నమ్మకమే వాలంటీర్లు అన్నారు. ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్న వ్యవస్థను.. గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా ? అని అన్నారు.
గత ప్రభుత్వంలో జన్మభూమి అరాచకాలు చూశారన్నారు. లంచాలు, అరాచకాలు లేని తులసి మొక్కలాంటి వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు అన్నారు. 25రకాల సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్లు అన్నారు. ఇంత మంచి జరుగుతున్నా ఓర్వలేక కడుపు మంటతో… మంచి చేసిన చరిత్ర లేనివాళ్లు అబద్ధాలు చెబుతున్నారన్నారు. నిజాలు చెప్పగలిగే సత్య సాయుధులు వాలంటీర్లన్నారు.