30 మంది గ్లొబల్ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ మంతనాలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లీన్ ఎనర్జీపై ప్రత్యక దృష్టి
ఏపీలో ఉన్న సానుకూలతలను వివరించిన యంగ్ మినిస్టర్
విదేశాల్లోనూ మంగళగిరి చేనేతకు ఫుల్ ఇంపార్టెన్స్
పారిశ్రామికవేత్తలకు చేనేత కండువాలతో సత్కారాలు
వెలగపూడి, ఆంధ్రప్రభ: దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ సదస్సులో బ్రాండ్ ఏపీ పునరుద్దరణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అండ్ టీమ్ పర్యటన కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో వెళ్లిన లోకేష్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతున్న పారిశ్రామిక విధానాలను తెలియజేశారు. నాలుగు రోజులపాటు జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో 30 మందికి పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్ పారిశ్రామిక వేత్తలు, తెలుగు డయాస్పోరా సమావేశాలకు హాజరై రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తూనే మరోవైపు 8 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై తమ గళాన్ని వినిపించారు. 9 మంది వివిధరంగాల అంతర్జాతీయ నిపుణులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు.
ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు..
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, అమలు చేస్తున్న ప్రోత్సాహకాలు, పరిశ్రమలకు అనువైన పర్యావరణ వ్యవస్థ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు పారిశ్రామికవేత్తలకు వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ఏవిధంగా అభివృద్ధి పథంలో పయనిస్తుందో ప్రత్యక్షంగా వివరించారు.
బిల్ గేట్స్, మిట్టల్ తోనూ చర్చలు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మిట్టల్ గ్రూప్ అధినేత లక్ష్మీ మిట్టల్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలసి పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దృక్కోణాన్ని సాక్షాత్కరించారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలు, ఫ్యార్మాస్యూటికల్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను అంతర్జాతీయ వేదికపై నుంచి వివరించారు. డబ్ల్యుఈఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంతరంగాన్ని ఆవిష్కరించారు.
మంగళగిరి చేనేత పరిమళం..
దావోస్ వెళ్లే ముందు మంగళగిరి చేనేత శాలువాలను ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తీసుకెళ్లారు. ప్రపంచ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంలోనూ మంగళగిరి చేనేతలపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. బిల్ గేట్స్, లక్ష్మీమిట్టల్ తో సీఎం చంద్రబాబుతో కలసి సమావేశమైన సందర్భంలో మంగళగిరి శాలువాలతోనే సత్కరించారు. తాము కలిసిన పారిశ్రామికవేత్తలందరినీ మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించి చేనేతపై ఉన్న అభిమానాన్ని లోకేష్ చాటారు.