తిరుపతి సిటీ, ఏప్రిల్ 11 (ప్రభ న్యూస్) : తెలుగు, సంస్కృత అకాడమీ పేరుతో వెబ్ సైట్స్ అందుబాటులోకి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మిపార్వతి తెలిపారు. మంగళవారం స్థానిక తుమ్మలగుంటలోని ఎస్.వి గోశాల ఆవరణంలో ఉన్న తెలుగు, సంస్కృత అకాడమీ ప్రాంతీయ కేంద్రంలో తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మి పార్వతి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ… తెలుగు అకాడమీ స్థాపించిన తర్వాత పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం జనరల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలను ముద్రించడం జరిగిందని, వీటితో పాటు ఏపీ, ఇండియన్ ఎకానమీ పుస్తకాలు కూడా త్వరలో ముద్రించడం జరుగుతుందని తెలిపారు. బీఈడీ సెమ్-1, సెమ్-3 కి సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారితో ఒప్పందం కుదుర్చుకొని త్వరలో డిగ్రీ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. తెలుగు మాతృ భాష కాని వారు, తెలుగు రాని వారి కోసం లెర్న్ తెలుగు పుస్తకాలు ఆడియో, వీడియో సి.డి.లు రూపొందించే దిశగా అకాడమీ కృషి చేస్తుందన్నారు.
తెలుగు అకాడమీ రూపొందించిన ప్రచురణలు ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా హోల్ సేల్, రిటైల్ సేల్ లో నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతుందన్నారు. ముద్రించిన పుస్తకాలన్నింటినీ తిరుపతి, అనంతపురం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, ప్రాంతీయ కేంద్రాల ద్వారా అమ్మడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం మాతృభాషా దినోత్సవం, ఉగాదిలను పురస్కరించుకుని తెలుగు భాష కోసం కృషిచేసిన మహనీయులకు పురస్కారాలు అందించడం జరుగుతుందని, సంస్కృత అకాడమీ ద్వారా ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి ఒక సంస్కృత కవికి సంబంధించిన జన్మదినం, రచనలకు సంబంధించిన విషయాలపై ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కొంత మంది సైబర్ నేరస్తులు తెలుగు, సాంస్కృతిక అకాడమీ పేరు మీద నకిలీ వెబ్ సైట్ ను తయారు చేసి నిరుద్యోగులకు అవకాశాలు, అకాడమీ పోస్టులు పడుతున్నాయని ధరఖాస్తు చేసుకోమని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఈ వార్తల పై విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. తెలుగు భాషను ప్రతి ఒకరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో తెలుగు మాండలికం పుస్తకంను ప్రతి జిల్లాలో ముద్రించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంస్కృత అకాడమీ రీసెర్చ్ అసిస్టెంట్ ఎస్.టి. ఎ. రాజ్యలక్ష్మి, రవిప్రసాద్, అకాడమీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.