– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
తెలంగాణ మీదుగా విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇందులో భాగంగా రాబోయే నాలుగు రోజులపాటు ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా చల్లని గాలులు కూడా ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం ఇవ్వాల (శనివారం) వెల్లడించింది.
ఇక.. శుక్రవారం నుండి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజుల్లో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా , రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలుంటాయని తెలిపింది. అంతేకాకుండా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా అధికారులు అంచనా వేశారు.
కాగా, తెలంగాణ మీదుగా విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు నెలకొన్న వాతావరణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మెటలాజికల్వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దక్షిణ ప్రాంతం, యానాం మీదుగా అల్ప ట్రోపోస్పిరిక్ దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి.
ఈ ప్రభావంతో ఇవ్వాల రాష్ట్రంలోని మూడు మండలాల్లో అనగా.. అనకాపల్లి జిల్లాలో రెండు, కాకినాడలో ఒక మండలానికి మాత్రమే వేడిగాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) అంచనా వేసింది. అదేవిధంగా.. మొత్తం 670 మండలాల్లో శుక్రవారం 10 మండలాల్లో మాత్రమే హీట్ వేవ్ నమోదైందని APSDMA తెలిపింది.