బంగాళాఖాతంలో అల్పపీడనం
ఈ నెల మూడో వారంలో తీరం దాటే అవకాశం
ప్రస్తుతం ఎపిలో పొడి వాతావరణం
రెండు నుంచి అయిదు డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం – వర్షాలు, వరదలతో విలవిల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవి వదిలిపెట్టేలా కనపడటంలేదు. బంగాళాఖాతంలో సెప్టెంబరు మూడోవారంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయుగుండంగా బలపడి రాష్ట్రంవైపు కదిలే పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రుతుపవన ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు దగ్గరగా కొనసాగుతుండటంతో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడటానికి అవకాశాలున్నాయని, ఈ ప్రభావంతోనే ఈనెల చివరివారంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఐదు డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
వర్షాలు శాంతించడంతో ఉష్ణోగ్రతలు తమ ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తిరుపతి, కడప, కావలి, నెల్లూరు, బాపట్ల, గన్నవరం, నరసాపురం, కాకినాడ, తుని, విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు ఐదు డిగ్రీలు అదనంగా నమోదయ్యాయి. రుతుపవన విరామంవల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తంమీద బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలిలో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.