నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తుపానుగా బలపడిన తర్వాత ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేశారు. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు ఉండదని పేర్కొంది. అల్పపీడనం ఏర్పడ్డాక మరింత స్పష్టత వస్తుందని పేర్కొంది.
కోస్తాలో చెదురుముదురు వర్షాలు
బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపారు. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తెలంగాణాలోనూ తేలికపాటి వర్షాలు
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నేడు వానలు పడుతాయని అధికారులు చెప్పారు.. బుధవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, జోగులాంబ తదితర జిల్లాల్లో వానలు కురవచ్చని వివరించారు.