Friday, November 22, 2024

AP: రాయలసీమలో 52 స్థానాలను గెలుస్తాం… చంద్ర‌బాబు

క‌ర్నూలు : ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోని రాయలసీమలో 52 సీట్లు టీడీపీ పార్టీయే గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాగళ‌ యాత్రలో భాగంగా సోమవారం ఆయన కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో ఏర్పాటు చేసిన రోడ్ షో ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. జగన్ ను చూస్తే తాలిబన్, బిల్ లాడెన్ గుర్తు వస్తానన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో అంగులమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. జగన్ ది క్లాస్ వార్ ఐతే తనది క్యాష్ వార్ గా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జగన్ పాల‌న‌ను చూసి విసిగిపోయిన‌ జనం ప్రస్తుత ఎన్నికల్లో జ‌గ‌న్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూడా ఎదురుగాలి ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేని అసమర్థులు జగన్ అని పేర్కొన్నారు. మీ భూములను కొట్టేయాలని చూస్తున్నాడు, ప్రజల భూములను లాక్కునే అధికారం జగన్ కి ఎవరు ఇచ్చారని ప్ర‌శ్నించారు.

వైసీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ది ముమ్మాటికీ మానసిక వైకల్యం అంటూ వ్యంగంగా స్పందించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా ఇస్తే.. ఇప్పుడు దొరక్కుండా చేశారన్నారు. తమ హాయాంలో రూ.500కు ట్రాక్టర్ ఇసుక ఇస్తే.. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక రూ.6000కు చేరుకుందన్నారు. ఇసుక ధ‌ర‌లు పెరగడం వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున వడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ దోచుకున్న డబ్బు ప్రజలకు చేరాలన్నదే తమ ఉద్దేశమన్నారు. రైతులు, ఇతరుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాన్ని చంద్రబాబు అక్కడికక్కడే తగలబెట్టడం విశేషం. ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 2019 లో ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నారు. అధికారం వచ్చిన తర్వాత మూడు రాజధానులు పేరిట నాటకం ఆడారన్నారు. ఆ తర్వాత ఒక్క రాజధాని కూడా కట్టింది లేదన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా రద్దు చేశారన్నారు. ఎక్కడాలేని జే బ్రాండ్ల‌ మద్యం తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యం గుళ్ల చేశారన్నారు. జగన్ దోచేసిన డబ్బుపై తాను పోరాడుతున్నాన‌న్నారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ పెడతామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. సైకో జగన్ ను నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. రాబోయే ఎన్నికల్లో మీ కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలన్నారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోగా.. 100కు పైగా ప్రాజెక్టుల పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారన్నారు. అబద్దాలను చెప్పి ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారని అన్నారు.

- Advertisement -

కోడి కత్తి, గులకరాయి డ్రామాలు ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. మూడు రాజధానులు కాదు ఒక్క రాజధాని అయినా కట్టారా అని చంద్రబాబు జగన్ ను నిలదీశారు. ఎన్నికల సందర్భంగా తిరిగి జనం ముందుకు వచ్చి అబద్దాలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై మీడియా ప్రశ్నిస్తుంటే వారిపైన కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. మీ భూములను కబ్జా చేసే వారు కావాలా, మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. మీ జీవితాన్ని మార్చే సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు వస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ సిక్స్ తో పాటు మోడీ గ్యారెంటీ పథకాలు ప్రజల ముందు ఉంటున్నాయన్నారు.. ఈనెల 13న పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌ ఓటర్లు బారులు తీరి తమ ఓటు వేసి వైకాపాను చిత్తుగా ఓడించాలని చంద్రబాబు కోరారు. జగన్ సైకో, అహంకారి, విధ్వంసకుడని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుత పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీకే ఉద్యోగులు మద్దతు పలుకుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి తెలుగుదేశంకే ఓటు వేస్తున్నారన్నారు.

కాటసాని భూకబ్జాల రెడ్డి…
పాణ్యం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కాటేసాని భూకబ్జాల రెడ్డిగా చంద్రబాబు అభివర్ణించారు. నియోజకవర్గంలో మరో కేజీఎఫ్ ఉందన్నారు. కోట్ల రూపాయల విలువచేసే మట్టి, ఎర్రమన్ను తవ్విన ఘనత కాటసానికే దక్కుతుందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి బుద్ధి చెప్పాలన్నారు. కబ్జాల రాయుడి గుండె అదిరిపోవాలన్నారు. గూబ పగిలిపోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కల్లూరులో అక్రమ పట్టాల సృష్టికర్త కాటసానిగా పేర్కొన్నారు. ఇక్కడ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా వదల లేదన్నారు. 524 సర్వే నెంబర్లు మసీదుకు చెందిన రెండు ఎకరాలు కాటసాని కొట్టివేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. భూమికోసం ముస్లింలను బెదిరించారన్నారు. కబ్జాల రాయుడు పాపాలు పండిపోయినట్లు చెప్పారు. కబ్జారాయుడు కాటసానిని ఓడించ‌డం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement