Friday, November 22, 2024

AP: మేనిఫెస్టోలో చోటు కల్పిస్తేనే… ఓటు వేస్తాం..

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : రాయలసీమలో పెండింగ్ లో ఉన్న సమస్యలకు మేనిఫెస్టో లో స్థానం కల్పించి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని రాజకీయ పార్టీలకు చెప్పాలని రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. రాయలసీమ వ్యాప్తంగా ప్రజాసంఘాలను సంఘటితం చేసి పెండింగ్ లో ఉన్న రాయలసీమ సమస్యలను పరిష్కారానికి రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకువచ్చే లక్ష్యంతో సమితి సీమ జిల్లాల్లో సమావేశాలను నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమాల పరంపరలో భాగంగా స్థానిక యూత్ హాస్టల్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాస్తవ స్థితిగతులు – అభివృద్ధి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామి రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశాన్ని ప్రముఖ రైతు నాయకుడు మాంగాటి గోపాల్ రెడ్డి నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన వివిధ ప్రజాసంఘాల, సామాజిక సేవా సంఘాల, సొసైటీల, రైతు సంఘాల, తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ వామపక్షాల ప్రతినిధులతో పాటు అనంతపురం, నంద్యాల ప్రాంతాలకు చెందినవారు పాల్గొన్నారు. ప్రధానంగా వక్తలందరూ మూడు దశాబ్దాల క్రితం ప్రారంభించిన గాలేరు నగరి ప్రాజెక్ట్ జిల్లా పరిధిలో రూపాంతరం చెందడం, హంద్రీ నీవా, తెలుగుగంగ అసంపూర్తిగా ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ఉత్తరాదికి తరలి పోవడం, తిరుపతి అభివృద్ధికి టి టి డి నిధులు వినియోగించే ప్రయత్నాలకు గండి పెట్టడం వంటి అంశాలపై విమర్శల వర్షం కురిపించారు. ఈ అంశాలపై ఏ రాజకీయ పార్టీ కూడా బలమైన ఉద్యమాలను చేపట్టకపోవడం, ఈ అంశాలపై ప్రజా ప్రతినిధులకు కనీస అవగాహన లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఒక ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ప్రాజెక్టులు, వాటి సమస్యలు, పూర్తి లభించే ఫలితాల గురించి రాయలసీమ జిల్లాలకు చెందిన విద్యా సంస్థల్లో చదివే యువతకు అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు చేయాలని, రాయలసీమ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి నిర్మించాలని సూచనలు చేశారు. రాయలసీమ పరిధిలో పెండింగ్ లో ఉన్న సమస్యలకు రాజకీయ పార్టీలు తమ ఎన్నిక మేనిఫెస్టోలో స్థానం కల్పించే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఆ విధంగా మేనిఫెస్టోలో స్థానం కల్పించి నిర్ణీత కాల పరిమితిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చే పార్టీకే ఓట్లు వేస్తామని చెప్పాలని వివిధ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాయలసీమ ఉద్యమంలో బేషరతుగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని వామపక్షాల ప్రతినిధులు నాగరాజు, వెంకయ్య, పెంచలయ్య రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నాయకుడు అంజయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకుడు నగేష్, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ప్రకటించగా తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిసి రాయలసీమ సమస్యలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేవిధంగా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ హామీ ఇచ్చారు.

- Advertisement -

రాయలసీమలోనే అత్యంత తక్కువ సాగునీటి వసతి కల్పించిన చిత్తూరు జిల్లాలో చెరువుల అభివృద్ధికి, గాలేరు నగరి, హంద్రీనీవా కాలువలు నిర్మాణానికి ప్రాధాన్యత నివ్వాలని బొజ్జా దశరథ రామిరెడ్డి డిమాండ్ చేసారు‌. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన సమావేశంలో రాయలసీమలో చెరువుల పరిరక్షణ, నిర్మాణం, వాటిని వాగులు, వంకలు, నదులు, కాలువలతో అనుసందానం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాయలసీమకున్న నీటి హక్కులలో 40శాతం నీటిని కూడా వినియోగంచుకొనలేని పరిస్థితుల్లో ఈ పరిస్థితిని సరిదిద్దడానికి బడ్జెట్ కేటాయింపుల్లో అగ్రస్థానం కల్పించాలని తీర్మానించారు.


రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులు సత్వరం పూర్తిచేసి, నికర జలాలు కేటాయించాలని తీర్మానించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న బుందేల్ఖండ్, కోరాపుట్, బోలంగీర్ తరహా ప్రత్యేక ప్యాకేజీ నిధులు సాధించి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడాలని తీర్మానించారు. హైకోర్టు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, కడప ఉక్కు కర్మాగారం, ఏఐఎంఎస్ రాయలసీమలో ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, కార్పొరేషన్లలో 40శాతం ఉద్యోగాలు రాయలసీమ యువతకు కేటాయించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో దళిత పోరాట సమితి నాయకులు చిన్నం కాళయ్య, జానపద భజన కళాకారుల సంఘం జాతీయ పులిమామిడి యాదగిరి, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు రామకృష్ణ, బాలకృష్ణ, బి జి నాయుడు, రాయలసీమ‌ ప్రజా సంఘాల నాయకులు పర్వేజ్, ముని బాబు, చంద్రబాబు, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్య సంస్థల కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement