నెల్లూరు, ప్రభ న్యూస్ : పెన్నానదికి అవసరమైన చోట పొర్లుకట్టల పటిష్టం, మరమ్మతు పనులను త్వరలో చేపట్టనున్నట్లు- జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గ్రామ సమీపంలో కోతకు గురైన పెన్నానది పరీవాహక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన స్థానిక ప్రజలు కలెక్టర్‌కు తమ ఆవేదనను తెలుపుకున్నారు. ఒక్కసారిగా పొర్లు కట్టలు దాటి నీళ్లు పైకి వచ్చాయని.. వెంటనే అధికారులు స్పందించి తాత్కాలికంగా కట్టను నిర్మించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. అలాగే తహసీల్దార్ పద్మజ వరద సమయంలో రాత్రంతా ఇక్కడే ఉండి మాకు ధైర్యం చెబుతూ పరిస్థితిని తమరికి వివరించి సహాయ కార్యక్రమాలు చేపట్టారని, మూడు బస్సులను కూడా సిద్ధం చేశారని గ్రామస్తులు కలెక్టర్ కు వివరించారు.
భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నదికి ఇరువైపులా పటిష్టంగా కట్టను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే వరదలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఇసుక మేట వేసిన పొలాల వివరాలు సేకరించామని, త్వరలోనే నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామన్నారు. దెబ్బతిన్న పంటల స్థానంలో కొత్తగా పంటలు వేసేందుకు 80 శాతం రాయితీతో 30 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నట్లు- చెప్పారు. దెబ్బతిన్న, కూలిన ఇళ్లకు నష్టపరిహారాన్ని బాధితులకు చెల్లించామని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే మరో రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital