విశాఖపట్నం, నవంబర్ 21 (ప్రభ న్యూస్): విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటనలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు, స్ధానిక నాయకులు కేంద్ర ఫిషింగ్ శాఖ అధికారులతో కలసి బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కేంద్రానికి కేంద్ర మత్స్యశాఖ అధికారులతో సమావేశమై త్వరగా పూర్తిస్ధాయిలో సమగ్ర నివేదికను పంపాలని కోరారు. కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా విశాఖ బోట్ల అగ్ని ప్రమాద దుర్ఘటనపై స్వయంగా పరిశీలించి క్షేత్రస్థాయి నివేదిక అందించాలని కోరిన నేపథ్యంలో తాను స్వయంగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించానని, సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ యూనిట్ అధికారులతో సమావేశమై కోరారు. జరిగినటువంటి నష్టంపై పూర్తిస్థాయి నివేదికను తయారు చేయవలసిందిగా బాధితులకు వీలైనంత ఎక్కువగా లబ్ధి చేకూర్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ డిప్యూటీ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.