రైతులను ఆదుకుంటామని.. రాబోయేది మన ప్రభుత్వమేనని, ధైర్యంగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రైతులకు భరోసా ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం డి.బెళగళ్ వద్ద మిర్చి రైతు కర్రియ్యను యువనేత లోకేష్ కలిసి, ఆయన కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కర్రియ్య మాట్లాడుతూ… అన్నదమ్ములం కలిసి 5ఎకరాల మిర్చిపంట వేశాం. రూ.10 లక్షల పెట్టుబడి అయితే 2లక్షల దిగుబడి వచ్చింది, నల్లితెగులు వచ్చి పంట నాశనమైందన్నారు. కోత కూలీ, పరదాలు, తాలుకాయల ఏరివేతకే రూ.2లక్షల ఖర్చయిందన్నారు. పండించిన పంటను బళ్లారి తీసుకెళ్లి అమ్ముకోవాల్సి రావడంతో అదనపు భారం పడుతోందన్నారు. గతంలో 28రకం ఎరువుల బస్తా రూ.1100 ఉంటే, ఇప్పుడు రూ.1900 అయ్యిందన్నారు.
గతంలో ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి అయితే, ఇప్పుడు రెట్టింపు అయ్యిందన్నారు. ఇప్పుడు కరెంటోళ్లు వచ్చి మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారు. నిన్న రాత్రి కూడా వర్షం పడి నానా అవస్థలు పడ్డాం, పట్టించుకునే నాథుడే లేడన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే కొంతకాలానికి రైతు అనే వాడే ఉండడన్నారు. ఈసందర్భంగా యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ… వ్యవసాయాన్ని పండుగ చేస్తానన్న ముఖ్యమంత్రి అన్నదాతలను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నారన్నారు. అకాలవర్షాల కారణంగా పంట నష్టపోతే ఈ ప్రభుత్వం దున్నపోతుపై వాన కురిసినట్లుగా ఉందే తప్ప పట్టించుకోవడం లేదన్నారు. గతంలో మిర్చి రైతులకు పరదాపట్టలు, సబ్సిడీపై పురుగుమందులు అందజేశామన్నారు. ఎవరెంత వత్తిడి తెచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక గతంలో ఇచ్చిన సబ్సిడీలన్నీ పునరుద్దరించి రైతులను ఆదుకుంటామన్నారు. పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం లాభసాటి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు అధైర్య పడకుండా ఒక్క ఏడాది ఓపిక పట్టండని నారా లోకేష్ రైతులను కోరారు.