Saturday, November 23, 2024

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధికి సహకరిస్తాం.. ఐటీ కంపెనీల బృందానికి కేంద్రమంత్రి హామీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంగళవారం బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో ఏపీ ఐటీ పరిశ్రమ ప్రతినిధి బృందం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ITAAP) ప్రెసిడెంట్ శ్రీధర్ కొసరాజు, WNS, Locn హెడ్ ఆర్.ఎల్. నారాయణ, పాత్రా ఇండియా ఎండీ లక్ష్మి, ఎఫ్‌ట్రానిక్స్ ఎండీ రామకృష్ణ దాసరి, Locn హెడ్ అకారపు వెంకట్ మధు శంకర్ కుమార్ కేంద్రమంత్రిని కలిసి ఐటీ అభివృద్థికి పలు ప్రతిపాదనలు చేశారు. వైజాగ్‌లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను వేగవంతం చేయడం, వైజాగ్/విశాఖపట్నంలో NIELIT సెంటర్‌, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటు, సీడాక్ సెంటర్‌, సైబర్ సెక్యూరిటీపై నేషనల్ లెవల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జింగ్ టెక్ స్కిల్లింగ్ ఈకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో కేంద్ర సహకారాన్ని ప్రతినిధి బృందం కోరింది.

వైజాగ్‌ సహా ద్వితీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్ ఈకో సిస్టమ్, సంస్కృతిని పెద్దఎత్తున ప్రోత్సహించడంలో మంత్రిత్వ శాఖ మద్దతు కావాలన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉత్పత్తి అభివృద్ధి, స్టార్టప్ కంపెనీల కోసం ప్రమోషన్ స్కీమ్‌ను ప్రారంభించాలని ఐటీ ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేశారు. వైజాగ్‌లో జరిగే ఐటీ సమ్మిట్ 2023కి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఐటీ రంగాభివృద్ధికి వారు చేసిన అన్ని ప్రతిపాదనలకు సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన ఐటీ పరిశ్రమాభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని ఎంపీ జీవీఎల్ తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement