Saturday, November 23, 2024

AP | రాష్ట్రానికి అండగా ఉంటాం : కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్

విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద విపత్తుపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను తిలకించారు. వరద నష్టాన్ని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, మనోహర్, అచ్చెన్నాయుడు పాల్లొన్నారు.

ఫొటో ఎగ్జిబిషన్ అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని.. ఏపీ వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. త్వరగా కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం అందేలా చేస్తామని శివరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్​ తెలిపారు.

రాష్ట్రంలో లక్షా 80 వేల హెక్టార్ల పంట నష్టం జరిగిందని అన్నారు. పశు, పంట నష్టంతో పాటు వ్యాపార సంస్థలు చాలా వరకు దెబ్బతిన్నాయని అన్నారు. కేంద్ర కమిటీ నివేదిక చూశాక ఆర్థిక సాయం అందుతుందని ఇలాంటి కష్టసమయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని శివరాజ్‌సింగ్‌ అన్నారు.

కాగా, గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ మండిపడ్డారు. బుడమేరు సమీపంలో అక్రమ మైనింగ్ జరపడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. ఇక‌ ప్రకాశం బ్యారేజీ సామర్థ్యంపై అమిత్‌షా, నిపుణులతో చర్చిస్తామని శివరాజ్‌సింగ్‌ అన్నారు. కృష్ణా నది, బుడమేరు రెండూ ఒకే సారి పొంగాయని దీంతో గతంలో ఎన్నడూ చవి చూడని జల ప్రళయాన్ని ఇప్పుడు విజయవాడ చవి చూసిందని విచారం వ్యక్తం చేశారు.

బ్యారేజ్‌ సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం..

- Advertisement -

ప్రకాశం బ్యారేజ్‌కు 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంకా బ్యారేజ్‌ సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతోందని శుక్రవారం నుంచి పనుల్లో పాల్గొంటుందని వివరించారు. కృష్ణా నది కరకట్టలు మరింత పటిష్టం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement