Tuesday, September 17, 2024

AP: ఆర్టీసీలో సమస్యలను పరిష్కరిస్తాం.. మంత్రి టీజీ భరత్

కర్నూలు బ్యూరో : ఆర్టీసీలోని సమస్యలను అంచలవారీగా ప్రణాళికా బద్ధంగా పరిష్కరిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కర్నూలు-1 డిపో గ్యారేజీలో 4కొత్త బస్సులను పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి టి.జి.భరత్ జెండా ఊపి ప్రారంభించి, అనంత‌రం బస్సు న‌డిపారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ… ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టీసీలోని సమస్యలను అంచలవారిగా ప్రణాళిక బద్ధంగా పరిష్కరిస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నుండి కర్నూలు, ఎమ్మిగనూరు నుండి హైదరాబాద్, ఆదోని నుండి కర్నూలు, కర్నూలు నుండి శ్రీశైలంకు 4 బస్సులను, గత నెలలో ఆరు బస్సులను మొత్తం 10 బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలోని ప్రజల సౌకర్యార్థం రద్దీగా ప్రయాణించే రోడ్లలో ప్రణాళిక బద్ధంగా కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామ‌ని మంత్రి అన్నారు. ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని ముందుగా అన్ని రూట్ల‌లో బ‌స్సుల సంఖ్య‌ను పెంచుతున్న‌ట్లు చెప్పారు. కర్నూలు బస్టాండ్‌లో ప్రజల సౌకర్యాలను ఇంకా అభివృద్ధి పరిచేలా చర్యలు చేపడతామని మంత్రి అన్నారు.

- Advertisement -

పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని ఆర్టీసీని ప్రణాళికా బద్ధంగా అంచలవారీగా అభివృద్ధి చేస్తుందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం గత నెలలో 6 బస్సులను, ఇప్పుడు 4 బస్సులను, మొత్తం పది బస్సులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని, ఇకనుంచి ఆర్టీసీని ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు, కర్నూలు-1 డిపో మేనేజర్ సుధారాణి, కర్నూలు-2 డిపో మేనేజర్ సర్దార్ హుస్సేన్, సూపర్ వైజర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement