Saturday, November 23, 2024

ఏజేన్సీ నాలుగు మండలాలకు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తాం.. సీఎం జ‌గ‌న్‌

చింతూరు, (అల్లూరి) ప్రభన్యూస్‌ : రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏజెెన్సీ నాలుగు మండలాలకు ఏర్పాటు చేసిన ఎటపాక రెవిన్యూ డివిజన్‌ను జిల్లాల పునర్విభజనలో ఎత్తివేసిన రెవిన్యూ డివిజన్‌ను మళ్ళీ నాలుగు మండలాలను కలుపుకొని రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన, బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో విలీన మండలాల ప్రజల కోరిక మేరకు నూతన రెవిన్యూ డివిజన్‌ను తిరిగి ఏర్పాటు చేస్తామన్నారు. వరదల సమయంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ కష్టపడి పని చేశారని కోనియాడారు.

రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇవ్వాల్సినవి అన్ని వనరులు అధికారులకు అందజేసి ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా చూడాలని చేప్పానని, అలాగే అధికారులు పని చేశారని అన్నారు. వరదల్లో నష్టపోయిన కుటుంబానికి అండగా నిలిచామన్నారు. చింతూరు మన్యం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి మన్యంవాసులు మాకు పరిహారం ఇప్పించండీ అని మొరపెట్టుకున్నారు. చింతూరు మండలంలోని కుయుగూరు, చట్టీ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరద బాధితుల ముఖాముఖిలో బాధితులంతా ఒకే మాటా, ఒకే బాట అన్న చందంగా మాకు పోలవరం ప్రాజెక్టు వలన ముంపునకు గురవుతున్న మా భూములకు, మాకు కాంటోర్‌లతో సంబంధం లేకుండా నాలుగు మండలాల ప్రజలకు పోలవరం భూ పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి ఇచ్చి పునరావాసం కల్పిస్తే వెంటనే ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోయి మా బ్రతుకులేదో మేము బ్రతుకుతామని సీఎంకి విన్నవించారు.

ప్రతి ఏడాది ఈ వరదలను ఎదుర్కోనడం మావళ్ళ కావడం లేదు ప్రతి సంవత్సరం వరదల వలన భారీగా నష్టపోతున్నాము, ఎన్నో బాధలు పడుతున్నాము ఇవన్ని తమరు దృష్టిలో పెట్టుకొని పోలవరం కాంటోర్లతో సంబంధం లేకుండా వెంటనే పోలవరం పరిహారం ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నామని మొరపెట్టుకున్నారు. కుయుగూరు గ్రామంలో ఇదే పరిస్థితి, చట్టీ గ్రామంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. మన్యంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరదలు సంభవించాయని, ప్రతి ఏటా ఇలా ఉంటే మా పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. మా గోడు పట్టించుకొని మా బాధలను తీర్చాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement