Thursday, September 5, 2024

AP: ప్రజల్లో నమ్మకం, భరోసా కల్పిస్తా.. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం, భరోసా కల్పించే విధంగా ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ముందుకు వెళ్ళనున్నట్లు విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ బాబు తెలిపారు. డ్రగ్స్ పై నిరంతర నిఘా ఉంచడంతోపాటు గస్తీని 24 గంటల పాటు ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు వారు ఎదుర్కొంటున్న బాధలను, సమస్యలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వివిధ రూపాల్లో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

అసాంఘీక శక్తులపై ఉక్కుపాదం మోపడంతో పాటు జిల్లాను ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని కనకదుర్గమ్మని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో రామారావు అమ్మవారి శేష వస్త్రం చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ బాబు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ప్రజల్లో నమ్మకాన్ని, భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. వినూత్న రీతిలో పోలీసింగ్ నిర్వహిస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతానన్నారు. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కల్గించేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చన్నారు. గ్రీవెన్స్ సెల్ ను మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రకటించారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల పనితీరును మెరుగు పరుస్తామన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు, డే, నైట్ బీట్స్ మరింతగా పెంచనున్నట్లు చెప్పారు. సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్లి కేసులు త్వరగా పరిష్కరించేలా చూస్తామన్నారు. 200 మంది సిబ్బందిని సైబర్ కమాండర్స్ గా నియమిస్తామన్నారు. రోడ్ సేఫ్టీ పై దృష్టి పెట్టి ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement