అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ఉద్యోగుల కొత్త పీఆర్సీ వేతనాలను నెల లోపు చెల్లిస్తామని రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు హామీ ఇచ్చారు. పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య నేతృత్వంలో యూనియన్ నేతలు గురువారం సచివాలయంలో కృష్ణబాబును కలిసి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వివరించారు. కేడర్ ఫిక్సేషన్ త్వరితగతిన పూర్తి చేసి కొత్త జీతాలు అందేలా చూడాలని వారు కోరారు. దీనిపై స్పందించిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కొత్త జీతాలు, 2020, 2021 పెండింగ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్లు ఇవ్వాలంటే హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో పీటీడీ ఉద్యోగుల జాబితా పొందుపరచాల్సి ఉంటుందన్నారు.
దీనిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెపుతూ నెలలోపు ఇస్తామని పేర్కొన్నారు. కాగా 2016 నుంచి అపరిష్కృతంగా ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయడం పట్ల అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శిని కలిసిన వారిలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డీఎస్పీ రావు, తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, రావులపాలెం కార్యదర్శి జీపీ రావు తదితరులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..