Monday, October 21, 2024

AP: శ్రీకాకుళం జిల్లా ప్రగతికి బాటలు వేస్తాం.. అచ్చెన్నాయుడు

ఏడాదిలో కే.ఆర్ స్టేడియం పనులు పూర్తి..
మూలపేటలో మినీ ఎయిర్పోర్ట్
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

(ప్రభ న్యూస్ బ్యూరో) శ్రీకాకుళం, జులై 18 : పక్కా ప్రణాళికతో జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. జిల్లాలోని గ్రామాలన్నింటినీ ఐదేళ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పునః నిర్మాణ పనులను ఆయన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలసి గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలసి కొద్దిసేపు ఆర్ అండ్ బీ, క్రీడా శాఖ, కాంట్రాక్టర్ లతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి రెండు ప్రధాన (స్టేడియం, శ్రీకాకుళం – ఆమదాలవలస రహదారి) సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయోనని గత ప్రభుత్వం మీద నమ్మకం లేక జిల్లా ప్రజానీకం దేవుడి మీద భారం వేసిందని, ఇప్పుడు వారి ఆశలు నెరవేరే రోజు వచ్చిందన్నారు. స్టేడియం పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ కి రెండేళ్ల సమయం ఉన్నపటికీ తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని కోరామని, ఏడాదిలోపే పూర్తి చేసి ఇస్తామని అధికారుల సమక్షంలో హామీ లభించిందని, అలాగే శ్రీకాకుళం – ఆమదాలవలస రహదారికి అత్యవసరంగా రూ.కోటి నిధులు ఇచ్చామని, కొత్త రోడ్డు జంక్షన్ నుంచి వాకలవలస వరకూ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. రహదారులే ప్రగతికి బాటలని, ప్రతీ వారం ఈ రెండు పనులపై సమీక్ష చేస్తామని చెప్పారు.

ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా పని చేస్తున్నామని, గత ఐదేళ్లలో వంశధార నుంచి చుక్క నీరు పలాస, వజ్రపు కొత్తూరులకు ఇవ్వలేక పోయారని, సీఎం చంద్రబాబు సారథ్యంలో తాము వచ్చీ రాగానే రూ.90 లక్షలతో .70 లక్షల ఎకరాలకు నీరివ్వడం ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు. తొమ్మిది శాఖలు నిర్వహిస్తున్న మంత్రిగా జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని మూలపేట పోర్టు పూర్తి చేసి, అక్కడే మినీ ఎయిర్పోర్ట్ నిర్మిస్తామన్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కొత్త గిడ్డంగులు నిర్మిస్తామని, మూలపేటలో రైతులు, జిల్లాలోని మత్స్య కారుల సమస్యలు పరిష్కరించి, వలసలు నివారిస్తామని వివరించారు. జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచి, రాష్ట్రంలో నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్ అండ్ బి ఎస్ఈ జాన్ సుధాకర్, డిఎస్డిఓ బి.శ్రీధర్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement