Friday, September 20, 2024

AP: అదివాసీల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగు ప‌రుస్తాం… చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – విజ‌య‌వాడ : మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీల జీవన ప్రమాణాలు, పరిస్థితులు ఇప్పటికీ దుర్భరంగానే ఉన్నాయని, గత ప్రభుత్వం ఆదివాసీలను పట్టించుకోలేదని విమర్శించారు సీఎం చంద్రబాబు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీల డప్పును మోగించారు. వారితో కలిసి నృత్యం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆదివాసీలు తమ కష్టాలను, సమస్యలను చెప్పే అవకాశం లేకుండా చేశారని, గడిచిన ఐదేళ్లలో ఆదివాసీలను పట్టించుకోలేదన్నారు. ఆదివాసీల కోసమే అరకు కాఫీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశామని, ప్రధాని మోదీనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారన్నారు. పారిస్ లో కూడా మన అరకు కాఫీ అమ్ముడవుతుందని గర్వంగా చెప్పారు సీఎం. గిరిజనులు ఆర్గానిక్ ఉత్పత్తులను పండిస్తారని, మెడిసినల్ వాల్యూ ఉండే ఉత్పత్తులన్నీ అడవుల్లోనే దొరుకుతాయని తెలిపారు. మనకు నాణ్యమైన తేనె కూడా అడవుల్లోనే దొరుకుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 6 లక్షల ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమన్నారు. గిరిజనులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకుని ఎదగాలని సూచించారు. దేశంలో తలసరి ఆదాయం లక్షా 72 వేలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం 2 లక్షల 20 వేలు ఉందని, తెలంగాణలో తలసరి ఆదాయం 3 లక్షల 20 వేల రూపాయలు ఉందన్నారు. అక్కడ గతంలో తాము చేసిన అభివృద్ధితో ఇప్పుడు తలసరి ఆదాయం పెరిగిందని చెప్పుకొచ్చారు చంద్రబాబు.

- Advertisement -

ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఆదివాసీల తలసరి ఆదాయం లక్షా 25 వేల రూపాయలుగానే ఉందని.. ఇతరుల కంటే వీరి ఆదాయం లక్ష తక్కువగా ఉందని, ఇది సమంజసం కాదన్నారు. గిరిజనుల తలసరి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇంకా డోలీలు కనిపించడం దురదృష్టకరమని, ఆదివాసీలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి ఆదుకునేంతవరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

2014-19 టీడీపీ హయాంలో ఆదివాసీల కోసం 16 పథకాలు, సుమారు 199 గురుకుల పాఠశాలలు, 2,705 విద్యాసంస్థలను ఏర్పాటు చేసి 2 లక్షల పై మందికి పైగా విద్యార్థులకు విద్యను అందించామని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement