- రాష్ట్రంలోనే అగ్రగామిగా విజయవాడ
- అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
- అనుగుణంగా డీపీఆర్ సిద్దం…
- 2014-19లో చేసిన అభివృద్ధిని మరిపించే విధంగా అభివృద్ధి చేస్తాం..
- నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : ఇటీవల వచ్చిన వరదలకు నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటుగా అమృత్ పథకంలో భాగంగా నగరానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి రాష్ట్రంలోనే విజయవాడను అగ్రగామిగా నిలుపుతామని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ ప్రకటించారు. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి డీపీఆర్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. నగరంలోని తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ లోని టిక్కిల్ రోడ్డు, గీతాంజలి అపార్ట్ మెంట్ వీధిలో సుమారు తొమ్మిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంగళవారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ… 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నగరాన్ని అభివృద్ధి చేశారని, ఆ అభివృద్ధిని మరిపించే విధంగా ఇప్పుడు మళ్లీ మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టడమే కాకుండా, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, ఎస్టీపీలను నిర్మాణం చేశామన్న అయన నగరంలోని రహదారులను అన్నింటినీ నిర్మాణం చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా చేస్తామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ… వైఎస్సార్సీపీ గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా జిల్లా అభివృద్ధి సమావేశం నిర్వహించలేదన్నారు. జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశాలపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు కలిసి చర్చించుకొని ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం అభివృద్ధి చేయడానికి ఈ సమావేశాలు నిర్వహించడం వల్ల వీలు కలుగుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల కాలంలోనే ఎంపీ కేశినేని శివనాథ్ జిల్లా అభివృద్దిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడమే కాకుండా జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో డీడీఆఠ్ సీ సమావేశం నిర్వహించి జిల్లా అభివృద్ధిపై చర్చించామని తెలిపారు. ఈ సమావేశమే కాకుండా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అందరితో సమావేశం నిర్వహించి అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించామన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని పాపాలే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా చేయలేదన్నారు. వైఎస్ఆర్సిపీ గత ఐదు సంవత్సరాల పాలనలో నగరంలోని ఒక మురుగు కాలువలు కూడా పూడిక తీయలేదని అందువల్లనే నగరంలో చిన్నపాటి వర్షానికే నగరంలోని రహదారులు చెరువులను తలపించే విధంగా మారుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూడిక తీయించి కాలువలను శుభ్రం చేయించామన్నారు.
ప్రజల నుంచి అత్యధికంగా పన్నులను వసూలు చేసిన వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం అభివృద్ధి పనులను చేయలేదన్నారు. మంత్రి మండలి, డీడీఆర్ సీ మీటింగ్, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థలోని కార్పోరేటర్లు ఇలా అందరూ సమిష్టిగా చర్చించుకుని అభివృద్ధికి ఏం చేయాలనే విషయాలపై ప్రణాళిక రూపొందించుకొని వాటిని అధికారులకు చెప్పి అభివృద్ధి చేయిస్తున్నామన్నారు. వచ్చే నెల జనవరి నుంచి అమరావతి పరిధిలో జరగనున్న అభివృద్ధి పనులతో విజయవాడ రూపురేఖలు మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, డివిజన్ సెక్రటరీ ఎమ్.రామకృష్ణ, డివిజన్ నాయకులు వీరా రెడ్డి, కృపారావు, కర్రి సురేష్, వి.అరుణ, గిరిబాబు, నాగేశ్వరరావు, స్థానికులు పొన్నం అనిల్ బాబు, పొన్నం శేషగిరిరావు, సుభాషిణి, కోగంటి రామారావు, కోమటి శ్రీధర్ బాబు, ఎండ్లూరి పుల్లయ్య, బద్దూరి వీరారెడ్డి, మల్లెల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.