Tuesday, November 26, 2024

సచివాలయ ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తాం : మంత్రి పెద్దిరెడ్డి..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పంచాయతీ కార్యదర్శులకు వేతన శ్రేణులు అనే అంశంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంగళవారం మంత్రి సమాధానం చెప్పారు. వీరి ప్రొబేషన్‌ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగుల పనితీరు పట్ల సీఎం సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు కావాలనే దీనిని రాజకీయం చేస్తోందని ఆయన చెప్పారు. ఇటీవల కొందరు కార్యదర్శులు, సచివాలయం ఉద్యోగులను తెదేపా నేతలు రెచ్చగొట్టినట్లు తెలిపారు. ప్రొబేషన్‌ ఇవ్వడం లేదని, జీతాలు పెంచడం లేదంటూ కొందరు నిరసనలు వ్యక్తం చేసిన క్రమంలో సీఎం జగన్మోహన రెడ్డి ప్రొబేషన్‌పై స్పష్టమైన ప్రకటన చేసినట్లు తెలిపారు.

అయితే తెలుగు పార్టీ నేతలు మాత్రం తమ హయాంలోనే ఉద్యోగాలు ఇచ్చినట్లు రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు. జూన్‌ తర్వాత నిబంధనల మేరకు సచివాలయ ఉద్యోగులకు జీతాలు వస్తాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. దీనిపై తెదేపా అతిగా స్పందించాల్సిన అవసరం లేదంటూ మంత్రి హితవు పలికారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్‌ ముందు చూపుతో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత గ్రేడ్‌-5 కింద రెండు విడతల్లో 6,778 పోస్టులు భర్తీ చేశామన్నారు. గ్రేడ్‌-6 కింద 9,376 డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేశామన్నారు. రెండు విడతల్లో సర్వీసు కమిషన్‌తో నిమిత్తం లేకుండా పంచాయితీరాజ్‌ శాఖ ద్వారానే పారదర్శకంగా పోస్టుల భర్తీ జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement