అంతర్జాతీయ నిపుణుల సహకారంతో పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరమన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటామన్నారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలన్నారు.‘మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాల విడుదల. అధికారిక వెబ్సైట్లలో వాటిని అందుబాటులో ఉంచుతాం. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి. 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు పోలవరంపై చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా నేటి మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
పోలవరంపై అంబటి వ్యాఖ్యలు చూసి సీఎం చంద్రబాబు పడీ పడీ నవ్వుకున్నారు.